మరోసారి తెరపైకి మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌ వ్యవహారం

మావోయిస్టు పార్టీలో రిక్రూట్‌మెంట్‌ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. విద్యార్థులు, యువతను మావోయిస్టు పార్టీలో చేర్పిస్తున్నారన్న ఆరోపణలపై చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) ప్రతినిధులు ముగ్గుర్ని ఎన్‌ఐఏ

Published : 24 Jun 2022 05:39 IST

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలకు.. రాష్ట్రంలోని కేసుతో సంబంధం

ఈనాడు-అమరావతి: మావోయిస్టు పార్టీలో రిక్రూట్‌మెంట్‌ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. విద్యార్థులు, యువతను మావోయిస్టు పార్టీలో చేర్పిస్తున్నారన్న ఆరోపణలపై చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) ప్రతినిధులు ముగ్గుర్ని ఎన్‌ఐఏ అధికారులు గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేయటం చర్చనీయాంశంగా మారింది. నర్సింగ్‌ విద్యార్థిని అయిన తన కుమార్తెను సీఎంఎస్‌ ప్రతినిధులు తీసుకెళ్లి మావోయిస్టు పార్టీలో చేర్పించారంటూ హైదరాబాద్‌లోని కాప్రాకు చెందిన పల్లెపాటి పోచమ్మ ఈ ఏడాది జనవరిలో విశాఖ గ్రామీణ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా తొలుత పెదబయలు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పుడు ఎన్‌ఐఏ దీనిపై కేసు నమోదు చేయటంతో గతంలో జరిగిన రిక్రూట్‌మెంట్‌ వ్యవహారం ఇప్పుడు వెలుగు చూసింది.
గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీలోకి ఏవోబీలోని ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో పెద్దగా రిక్రూట్‌మెంట్లు లేవు. దీంతో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ప్రాంతాల్లో నియామకాలు చేపట్టి ఏవోబీకి తీసుకొస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇది పెద్దగా ప్రభావం చూపట్లేదనేది పోలీసుల మాట. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళా, ప్రజా సమస్యలపై అవగాహన సదస్సుల పేరిట ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్ల పేరిట యువతను, విద్యార్థుల్ని మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. వారినే క్రమంగా పార్టీలో చేర్పిస్తున్నట్లు తేల్చాయి. తాజాగా ఎన్‌ఐఏ నమోదు చేసిన కేసుకు సంబంధించిన వ్యవహారంలో రాధ అనే నర్సింగ్‌ విద్యార్థినిని ఇదే తరహాలో ఆకర్షించి చైతన్య మహిళా సంఘం సభ్యులు 2017 డిసెంబరులో మావోయిస్టు పార్టీలో చేర్చినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. నీల్ఫో అనే పేరుతో ఆమె పార్టీలో కొనసాగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టు అగ్రనాయకులు ఆర్‌కే, ఉదయ్‌, అరుణతో కలిసి ఆమె పనిచేస్తున్నట్లు తేల్చాయి. ఈ నేపథ్యంలో ఇదే తరహాలో ఇంకా ఎవరైనా కొత్తగా పార్టీలో చేరారా? ఎప్పుడు చేరారు? అదృశ్యమైన వారిలో అలా అజ్ఞాతంలోకి వెళ్లిన వారు ఉన్నారా అనే అంశాలపై నిఘా వర్గాలు, ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని