బలహీనవర్గాలపై కక్షసాధింపు ఇది

ముఖ్యమంత్రి జగన్‌ అవినీతిని ప్రశ్నించిన బలహీనవర్గాలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను

Published : 24 Jun 2022 05:39 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ అవినీతిని ప్రశ్నించిన బలహీనవర్గాలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను అర్ధరాత్రి నిబంధనలకు విరుద్ధంగా కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. మంగళగిరిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అయ్యన్నపాత్రుడు అన్ని అనుమతులు తీసుకొని, నిబంధనల మేరకే ఇంటిని నిర్మించుకున్నారు. బలహీనవర్గానికి చెందిన ఆయన కుటుంబంతో అధికారులు వ్యవహరించిన తీరు అమానుషం. తన అవినీతిని ప్రశ్నించినవారిపై జగన్‌రెడ్డి చేయిస్తున్న దాడులను ప్రజలు గమనిస్తున్నారు. ఐపీఎస్‌ అధికారి మణికంఠ, ఆర్డీవో గోవిందరావు, పురపాలక కమిషనర్‌ కనకారావు, ఎమ్మార్వో జయలకు రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానం ఉందా? అర్ధరాత్రి జేసీబీలతో మీ ఇళ్లను కూల్చితే మీకు బాధ కలగదా? నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మిస్తే... 15 రోజుల ముందు నోటీసులివ్వాలి. కానీ నిమిషం ముందు నోటీసులిచ్చారు. సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి కూల్చివేతలు చేపట్టొదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ఆదేశాలను సదరు అధికారులు అమలు చేయలేదు. ఈ మూడేళ్లలో వైకాపా నేతలు చెప్పారని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదు’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


క్యాసినోకు యత్నించిన వారిని శిక్షించాలి: వర్ల రామయ్య  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా మంత్రులు, నాయకులు రాష్ట్రంలో జూదం, క్యాసినో విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. గుడివాడ తరహాలో కంకిపాడులో క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి గురువారం ఆయన లేఖ రాశారు. ‘గతంలో మాజీమంత్రి కొడాలి నాని గుడివాడలో నిర్వహించిన క్యాసినోపై అనేక ఫిర్యాదులు చేసినా నేటికీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. దీంతో కంకిపాడులోనూ క్యాసినో నడపడానికి ప్రయత్నించారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పోలీసులు దాన్ని రద్దు చేశారు. వైకాపా నాయకులతో కొందరు పోలీసులు కుమ్మక్కయి క్యాసినోల నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని