అవయవాలున్నా అ‘మార్చే’వారేరి?

ఇది రాష్ట్రానికే తలవంపు. ఇక్కడి ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక విలువైన మానవ అవయవాలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కిడ్నీల మార్పిళ్లు మాత్రమే ఇక్కడ ఎక్కువగా

Updated : 27 Jun 2022 06:14 IST

నిపుణుల కొరత.. ఆసుపత్రుల్లో సదుపాయాల లేమి

పొరుగు రాష్ట్రాలకు కాలేయం, గుండె, ఊపిరితిత్తులు

రాష్ట్రంలో కిడ్నీల మార్పిడికే పరిమితమైన ఆసుపత్రులు

ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చితే పేదలకు ప్రయోజనం

ఈనాడు, అమరావతి: ఇది రాష్ట్రానికే తలవంపు. ఇక్కడి ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక విలువైన మానవ అవయవాలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కిడ్నీల మార్పిళ్లు మాత్రమే ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. లివర్‌, గుండె, ఊపిరితిత్తులు, క్లోమగ్రంధి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లిపోతున్నాయి. వైద్య నిపుణులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెట్టక ఈ దుస్థితి నెలకొంది. అవయవాలు ఉన్నా.. ఉపయోగించుకోలేక బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మృతుల కుటుంబాలు అవయవ దానానికి ఉదారంగా ముందుకొస్తున్నా.. అవి గ్రీన్‌ ఛానల్‌ ద్వారా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. దీంతో ధనవంతుల కుటుంబాలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నాయి. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని సర్జరీ విభాగాలను బలోపేతం చేసి, వైద్యులను ప్రోత్సహిస్తే రాష్ట్రవాసులు ప్రయోజనం పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యశ్రీ జాబితాలోకి అవయవాల మార్పిడిని తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంటున్నారు.

45 ఆసుపత్రుల నమోదు 

అవయవాల మార్పిడి కోసం రాష్ట్రంలో 45 ఆసుపత్రులు ‘జీవన్‌దాన్‌’లో పేర్లు నమోదు చేసుకున్నాయి. జీవన్మృతులుగా ప్రకటించిన వ్యక్తుల నుంచి అవయవాలు తొలగించి అవసరమైన వారికి అమరుస్తారు. కొందరు ప్రభుత్వ అనుమతితో కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీ వంటి వాటిని మార్చుకోవాలని చూస్తున్నారు. జీవన్‌దాన్‌ ఆసుపత్రుల్లో గత జనవరి వరకు 1,799 అవయవాల మార్పిడి జరిగింది. ఇందులో 1,788 కిడ్నీలు, 10 కాలేయ మార్పిడి కేసులు ఉన్నట్లు ఆ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ రాంబాబు తెలిపారు.

విశాఖలోనే 1000 కిడ్నీల మార్పిడి 

2015 నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని 10 ఆసుపత్రుల్లో సుమారు వెయ్యి వరకు కిడ్నీ మార్పిళ్లు జరిగాయి. తరువాత విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో ఎక్కువగా ఈ ఆపరేషన్లు జరిగాయి. ఈ శస్త్రచికిత్సల కోసం జీవన్‌దాన్‌ వద్ద పేర్లు నమోదు చేసుకున్నవారు మరో 1,608 మంది ఉన్నారు.

పొరుగు రాష్ట్రాలకు 128 అవయవాల తరలింపు 

రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల నుంచి 2015 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు 128 అవయవాలు తరలిపోయాయి. వాటిలో కాలేయం-15, గుండె-50, ఊపిరితిత్తులు-62, క్లోమం ఒకటి ఉన్నాయి. గరిష్ఠంగా 88 అవయవాలు తమిళనాడుకు తరలివెళ్లాయి. తెలంగాణకు వెళ్లిన అవయవాల్లో 14 ఊపిరితిత్తులు, కాలేయం-14, గుండె-6 ఉన్నాయని జీవన్‌దాన్‌ సమన్వయకర్త డాక్టర్‌ రాంబాబు తెలిపారు. కిడ్నీల మార్పిడి యూరాలజిస్ట్‌ ఆధ్వర్యంలో జరుగుతుంది. తర్వాత నెఫ్రాలజిస్ట్‌ ద్వారా రోగులకు చికిత్స అందుతుంది. అలాగే.. లివర్‌ సర్జరీకి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌, మెడికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ అవసరం ఉంటుంది. ఇతర అవయవాలకు ఆయా విభాగాల సర్జన్లు, ఇతర నిపుణులు అవసరం. వీరి కొరత వల్ల అవయవ మార్పిడి ఆపరేషన్లకు వీలుపడడంలేదు. ప్రభుత్వం కనీసం విశాఖ, కాకినాడ, విజయవాడ/గుంటూరు, తిరుపతి బోధనాసుపత్రుల్లో అవయవాల మార్పిడి యూనిట్‌్్సను పటిష్ఠం చేస్తే పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి ఉపశమనం లభిస్తుందని అఖిల భారత అవయవ, శరీర దాతల సంఘం వ్యవస్థాపకురాలు గూడూరు సీతామహాలక్ష్మి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని