అన్నా‘ఢీ’ఎంకే!

తమిళనాడును 30 ఏళ్లకు పైగా పాలించిన అన్నాడీంఎకేలో నేడు అంతర్గత వైరం తారస్థాయికి చేరింది. పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), సంయుక్త సమన్వయకర్త ఎడప్పాడి

Updated : 29 Jun 2022 06:33 IST

తమిళనాట విపక్షంలో తారస్థాయి ఆధిపత్య పోరు

పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వ్యూహాలతో శ్రేణుల్లో చీలిక

చెన్నై (సైదాపేట), న్యూస్‌టుడే: తమిళనాడును 30 ఏళ్లకు పైగా పాలించిన అన్నాడీంఎకేలో నేడు అంతర్గత వైరం తారస్థాయికి చేరింది. పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), సంయుక్త సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తల్లో అయోమయం ఆవహించింది. ఈనెల 23న జరిగిన సర్వసభ్య సమావేశంలో పార్టీ తాత్కాలిక ప్రిసీడియం ఛైర్మన్‌గా ఉన్న తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ను శాశ్వత ప్రిసీడియం ఛైర్మన్‌గా నియమిస్తూ పళనిస్వామి తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గించారు. దీన్ని వ్యతిరేకించిన ఓపీఎస్‌ వర్గీయులు సమావేశాన్ని బహిష్కరించారు. మరోపక్క, కొత్త ప్రిసీడియం ఛైర్మన్‌ హుస్సేన్‌ తర్వాతి సర్వసభ్య భేటీ జులై 11న జరుగుతుందని ప్రకటించారు. దీనిపై ఓపీఎస్‌ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజకీయంగా ఒకరినొకరు లక్ష్యం చేసుకోవడమే కాదు, పార్టీ వ్యవహారాలపై కోర్టులకెక్కడంతో తమిళనాట ఉత్కంఠ నెలకొంది.

ఆరేళ్లుగా కలహాల కాపురం

మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్‌లో చనిపోగా, అప్పట్లో ఆమె నెచ్చెలి శశికళను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అదే సమయంలో ఓపీఎస్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, నాటకీయ పరిణామాల నడుమ ఈపీఎస్‌ గద్దెనెక్కారు. అన్నాడీఎంకేలో అప్పటివరకు ఉన్న ప్రధాన కార్యదర్శి పదవిని రద్దుచేసి సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్త పదవులు సృష్టించి పన్నీర్‌, పళనిస్వామిలు వాటిని పంచుకున్నారు. అంతలోనే శశికళ అక్రమాస్తుల కేసులో జైలుపాలు కాగా, ఆమెతో పాటు టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ముఖ్యమంత్రి పదవిపై పన్నీర్‌, పళని మధ్య విభేదాలు పొడచూపినా, పూర్తికాలం నెట్టుకొచ్చారు. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయాక లుకలుకల బయటపడ్డాయి. ద్వంద్వ నాయకత్వమే కారణమంటూ పార్టీ శ్రేణులు అధినాయత్వం వైపు వేలెత్తిచూపాయి. తాజాగా, జూన్‌ 23న సర్వసభ్య సమావేశం జరుగుతుందని అధిష్ఠానం ప్రకటించగా, దానిపై చర్చించేందుకు సన్నాహకంగా 14న జిల్లా కార్యదర్శుల భేటీ నిర్వహించారు. అందులో పళనిస్వామి మద్దతుదారులు ఏకనాయకత్వం అంశాన్ని లేవనెత్తగా, పన్నీర్‌ వర్గీయులు వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరువర్గాల మద్దతుదారులు గోడపత్రికలు వేసుకోవడంతో విభేదాలు రోడ్డున పడ్డాయి. అయినప్పటికీ, 23న జరిగే సమావేశంలో పళనిస్వామి ఏకనాయకత్వానికి మద్దతు లభిస్తుందన్న అంచనాలు రావడంతో పన్నీర్‌ వర్గం అప్రమత్తమైంది. కోర్టును ఆశ్రయించి కొత్త తీర్మానాలు చేయకుండా నిషేధం పొందారు.

న్యాయపోరాటంలో నెగ్గేదెవరు?

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు భాజపా ఆహ్వానం మేరకు పన్నీర్‌సెల్వం గత వారం దిల్లీ వెళ్లారు. ఆ రోజంతా ఓపీఎస్‌, ఆయన కుమారుడు, ఎంపీ రవీంద్రనాథ్‌కుమార్‌ ప్రధాని మోదీ వెన్నంటే కన్పించారు. తాజాగా, జులై 11న జరగాల్సిన సర్వసభ్య, అంతకుముందు నిర్వహించాల్సిన సన్నాహక సమావేశాలను రద్దు చేయాలంటూ పన్నీర్‌ తరఫున ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టులోనూ కేవియట్‌ పిటిషన్‌ వేశారు. పళనిస్వామి మరో అడుగు ముందుకేసి పార్టీలో సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్తల పదవీకాలం ముగిసిందని, ఓపీఎస్‌ కోశాధికారి మాత్రమేనని ప్రకటించారు. ఓపీఎస్‌ ఆరోపణలకు బదులిచ్చేందుకు ఎడప్పాడి వర్గం న్యాయనిపుణులతో చర్చిస్తోంది. మొత్తంగా అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరుతో అన్నాడీఎంకేలో పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని