అది నేరపూరిత సొమ్మే

ఎమ్మార్‌ కేసుకు సంబంధించి కోనేరు మధు ఖాతాల్లో జమ అయిన మొత్తానికి, ఎమ్మార్‌ అవకతవకలకు సంబంధం ఉందని, అది నేరపూరిత సొమ్మేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)

Published : 01 Jul 2022 06:11 IST

కోనేరు మధు పిటిషన్‌పై ఈడీ వాదన

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసుకు సంబంధించి కోనేరు మధు ఖాతాల్లో జమ అయిన మొత్తానికి, ఎమ్మార్‌ అవకతవకలకు సంబంధం ఉందని, అది నేరపూరిత సొమ్మేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ప్రాథమిక జప్తుపై విచారణ చేపట్టాకే అసలు విషయం వెల్లడవుతుందని తెలిపింది. ఎమ్మార్‌లో అక్రమంగా ప్లాట్ల విక్రయం ద్వారా లబ్ధి పొందడంతో పాటు మనీలాండరింగ్‌ ఆరోపణలపై నమోదుచేసిన కేసులో గత ఏడాది నవంబరు 11న ఈడీ జారీ చేసిన సమన్లను, దాంతోపాటు నవంబరు 25న జారీచేసిన తాత్కాలిక జప్తు ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కోనేరు మధు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌.నందలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ తరఫు న్యాయవాది అనిల్‌ప్రసాద్‌ తివారీ వాదనలు వినిపిస్తూ ప్లాట్‌ కొనుగోలుదారులైన పార్థసారథి, చల్లా సురేష్‌ కోనేరు మధు ఖాతాలో సొమ్ము వేశారన్నారు. పిటిషనర్‌ బీమా పాలసీల సొమ్మును ఆయన తండ్రి కోనేరు రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని ట్రైమెక్స్‌ కంపెనీ చెల్లించిందన్నారు. ఎమ్మార్‌ వ్యవహారంలో కోనేరు మధుపై సీబీఐ, ఈడీ కేసులను ఈ హైకోర్టు కొట్టేయడంతో కోనేరు రాజేంద్రప్రసాద్‌ ఈ పాలసీలను మధు పేరుతో మార్చారన్నారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 1998లో బీమా పాలసీలు తీసుకున్నామని, 2006-07లో ఎమ్మార్‌ లావాదేవీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఎమ్మార్‌తో సంబంధం లేకముందే తీసుకున్న పాలసీలను నేరపూరిత సొమ్ము అంటూ జప్తు చేయడం సరికాదన్నారు. నవంబరు 24న ఈడీ నోటీసులు జారీచేసి, వివరణకు అవకాశం ఇవ్వకుండా 25న జప్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ జప్తును రద్దుచేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తనపై ఈడీ కేసును కొట్టేయాలంటూ కోనేరు ప్రదీప్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణను జులై 25కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని