దేశంలో ‘ఒమిక్రాన్‌’ సామాజిక వ్యాప్తి

దేశంలో కరోనా ఒమిక్రాన్‌ రకం సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) చెందుతున్నట్లు జన్యుక్రమ విశ్లేషణ కన్సార్షియం ఇన్సాకాగ్‌ వెల్లడించింది. కొత్త కేసుల విస్ఫోటం జరుగుతున్న మెట్రో నగరాల్లో దీని ప్రభావం అధికంగా ఉన్నట్లు

Updated : 24 Jan 2022 05:10 IST

మెట్రో నగరాల్లో అధిక ప్రభావం
‘ఇన్సాకాగ్‌’ వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా ఒమిక్రాన్‌ రకం సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) చెందుతున్నట్లు జన్యుక్రమ విశ్లేషణ కన్సార్షియం ఇన్సాకాగ్‌ వెల్లడించింది. కొత్త కేసుల విస్ఫోటం జరుగుతున్న మెట్రో నగరాల్లో దీని ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు ఇన్సాకాగ్‌ తాజా బులిటెన్‌లో పలు అంశాలను వెల్లడించింది. దేశంలో ఒమిక్రాన్‌ ఉప రకమైన ‘బీఏ-2’ వైరస్‌ అత్యధికంగా కనిపిస్తోందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్‌-జీన్‌ డ్రాపవుట్‌ ఆధారిత స్క్రీనింగ్‌తో ఎక్కువ తప్పుడు నెగెటివ్‌లు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అందుకే పీసీఆర్‌ ఆధారిత స్క్రీనింగ్‌ను ఒమిక్రాన్‌ రకం కేసుల పరీక్షకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే ఇంతవరకు ఒమిక్రాన్‌ కేసులు అత్యధికంగా స్వల్ప లక్షణాలతోనో లేదా లక్షణాలు లేకుండానో కనిపించినట్లు తెలిపింది. ఇప్పుడిప్పుడే ఆసుపత్రుల్లో చేరికలు, ఐసీయూ కేసులు పెరుగుతున్నట్లు పేర్కొంది. ‘ముప్పు’స్థాయిలో మాత్రం ఇప్పటికీ ఎలాంటి మార్పులేదని తెలిపింది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ‘బి.1.640.2’ రకం వైరస్‌ను కూడా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. ఇది వేగంగా విస్తరిస్తున్నట్లు సాక్ష్యాలేమీ లేవని, దీన్ని ప్రస్తుతానికి ఆందోళనకర రకం (వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌)గా భావించడం లేదని పేర్కొంది. ఈరకం వైరస్‌ కేసులు భారత్‌లో ఇంతవరకూ రాలేదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగానూ ఒమిక్రాన్‌ కేసులు భారీ సంఖ్యలోనే నమోదవుతున్నట్లు పేర్కొంది. అయితే డెల్టా రకం వేవ్‌తో పోలిస్తే ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరే వారి నిష్పత్తి చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. నిమోనియాను వ్యాపింపజేసే శక్తి తక్కువగా ఉండటంవల్ల ఈ వైరస్‌ వల్ల రోగం తీవ్రరూపం సంతరించుకోవడం లేదని, దానివల్ల అత్యధికమంది దీన్ని తట్టుకోగలుగుతున్నారని విశ్లేషించింది. అయితే కేసుల సంఖ్య అత్యధికంగా ఉండటం వల్ల ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా దేశాల్లో ఇదివరకటి కంటే ఎక్కువే ఉన్నట్లు తెలిపింది. ఇది వైద్య ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతున్నట్లు అభిప్రాయపడింది. గత ఉద్ధృతులతో పోలిస్తే ప్రస్తుతం మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు లభించిన సాక్ష్యాధారాలను బట్టి రోగ తీవ్రత, మరణాలు వ్యాక్సిన్‌ తీసుకోనివారిలోనే అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారు లేదా గతంలో ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారిలో అత్యధిక రక్షణ ఉన్నట్లు విశ్లేషించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని