30 ఏళ్ల వయసులో 47 మంది పిల్లలు.. త్వరలోనే మరో పది మంది

కైల్‌ గార్డీ.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 30 ఏళ్ల వీర్య దాత. ఈ క్రమంలో ఇప్పటికి 47 మంది చిన్నారులకు జీవశాస్త్ర సంబంధమైన (బయలాజికల్‌) తండ్రిగా నిలిచారు. త్వరలోనే మరో 10 మంది చిన్నారులు ఈ జాబితాలో చేరనున్నారు.

Updated : 01 May 2022 09:07 IST

అమెరికా వీర్య దాత కైల్‌ గార్డీ ఘనత

వాషింగ్టన్‌: కైల్‌ గార్డీ.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 30 ఏళ్ల వీర్య దాత. ఈ క్రమంలో ఇప్పటికి 47 మంది చిన్నారులకు జీవశాస్త్ర సంబంధమైన (బయలాజికల్‌) తండ్రిగా నిలిచారు. త్వరలోనే మరో 10 మంది చిన్నారులు ఈ జాబితాలో చేరనున్నారు. వీర్య దాత (స్పెర్మ్‌ డోనార్‌)గా కొనసాగాలన్న నిర్ణయంపై తనకెలాంటి విచారం లేదని, అదే సమయంలో ఆ నిర్ణయం కారణంగా వ్యక్తిగతంగా డేటింగ్‌ జీవితం కష్టమై పోయిందని ఈ సందర్భంగా ఆయన వాపోయారు. జీవిత భాగస్వామిని గుర్తించడం కూడా ఇబ్బంది అవుతోందని చెప్పారు. తొలినాళ్లలో తనకెలాంటి దీర్ఘకాల సంబంధాలు లేకున్నా.. తన డేటింగ్‌ జీవితం యావరేజ్‌గా సాగేదని, ఇప్పుడు తనను చాలా మంది మహిళలు కేవలం సంతానం కోసం మాత్రమే సంప్రదిస్తున్నారని చెప్పుకొచ్చారు. ‘‘నా కారణంగా చాలా పిల్లలను కన్నారు. దీంతో నా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు మహిళల నుంచి సందేశాలు వెల్లువెత్తాయి. ఏకంగా అన్ని సందేశాలు రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. చాలా మంది మహిళలు నా వీర్యం కోసం ఆసక్తి చూపుతారని నాకు అనిపించలేదు. ఎందుకంటే వారందరి వద్ద డబ్బులు బాగానే ఉన్నాయి. స్పెర్మ్‌ బ్యాంక్‌కు వెళ్లే అవకాశముంది. వారు మాత్రం వివిధ కారణాలు చెప్పారు. చాలా మంది తమ సంతానానికి జీవసంబంధమైన తండ్రిని చూపించాలన్న కోరికను వెలిబుచ్చారు’’ అని వివరించారు. ‘‘దురదృష్టవశాత్తు చాలా మంది మహిళలు నాతో డేటింగ్‌కు ఆసక్తి చూపలేదు. కొంత మంది మహిళలు నాతో సంబంధానికి ఆసక్తి చూపినా ఆ విషయమై ముందడుగు పడలేదు. ఒకవేళ ఎవరైనా ప్రత్యేక మహిళ వస్తే.. నేను సంతోషంగా ఆహ్వానిస్తాను’’ అని  కైల్‌ చెప్పారు. గత ఎనిమిదేళ్లలో సుమారు వెయ్యి మంది మహిళలు వీర్యం కోసం తనను సంప్రదించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వీర్య దానం కోసం ప్రపంచ పర్యటనలో ఉన్న ఆయన తన సంతానాన్ని కలుసుకుంటున్నారు కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని