Crime News: ఈ-బైక్‌లు.. బయోడీజిల్‌ అంటూ బురిడీ

వాహనదారులు, మదుపరులు కోరుకుంటున్న కొత్త ఆవిష్కరణలు.. వస్తువులు.. ఇంధనాలను తక్కువ ధరకే ఇస్తామంటూ నేరస్థులు నయా మోసాలకు తెర తీస్తున్నారు.

Updated : 03 May 2022 11:11 IST

రూ.లక్షల్లో లాభాలంటూ నేరస్థుల మాయాజాలం

ఈనాడు, హైదరాబాద్‌: వాహనదారులు, మదుపరులు కోరుకుంటున్న కొత్త ఆవిష్కరణలు.. వస్తువులు.. ఇంధనాలను తక్కువ ధరకే ఇస్తామంటూ నేరస్థులు నయా మోసాలకు తెర తీస్తున్నారు. ఎలక్ట్రిక్‌ బైకులను వేగంగా డెలివరీ చేస్తామని.. బయోడీజిల్‌ను భారీ వాహనాలు, కార్లకు సరఫరా చేస్తున్న సంస్థల్లో మదుపు చేయిస్తామంటూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ముందుగానే డబ్బు తీసుకుని ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు. హైదరాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాల్లో ఈ తరహా నేరాలు పెరుగుతున్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండడంతో ఇవి బహిర్గతమవుతున్నాయి. ఇలాంటి కేసుల్లో అనుమానం వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలకు బయో డీజిల్‌ అంటూ కోట్లు స్వాహా

బయోడీజిల్‌ ప్రాజెక్టులో మదుపు చేస్తే.. రూ.లక్షల్లో లాభాలొస్తాయంటూ హైదరాబాద్‌లోని సహాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని రవికాంత్‌ను ఓ వ్యక్తి ఏడాది క్రితం సంప్రదించాడు. తమ సంస్థ ఐదేళ్ల నుంచి బయోడీజిల్‌ ఉత్పత్తి చేస్తూ ప్రముఖ ప్రైవేటు సంస్థలకు సరఫరా చేస్తోందని నమ్మించాడు. ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీలతోనూ ఒప్పందం కుదుర్చుకున్నామని సదరు సంస్థ ప్రతినిధులు చెప్పారు. రూ.5.20 కోట్లు మదుపు చేస్తే.. నెలనెలా లాభాలిస్తామని వివరించారు. సరేనంటూ రవికాంత్‌ రూ.5.20 కోట్లు ఇచ్చారు. వారి మాటలు నమ్మి మరో రూ.2.40 కోట్లు కూడా ఇచ్చారు. చివరికి మోసపోయానని గ్రహించి రవికాంత్‌ మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పదిరోజుల్లో ఈ-బైక్‌

ప్రస్తుతం ఈ-బైక్‌ల డెలివరీకి నెలరోజులపైనే పడుతోంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న సైబర్‌ నేరస్థులు ఈ బైక్‌లను వేగంగా డెలివరీ చేస్తామంటూ సామాజిక మాధ్యమాలు ద్వారా ప్రచారం చేస్తున్నారు. తొలుత రూ.10 వేలు చెల్లించాలని డెలివరీ సమయంలో మిగతాది ఇస్తే సరిపోతుందని నమ్మబలుకుతున్నారు.  బయానా చెల్లించాక.. మూడు రోజుల్లోనే బైక్‌ ఇస్తాం... మిగిలిన మొత్తాన్ని నగదు బదిలీ చేయండి అంటూ తొందరపెడుతున్నారు. బాధితులు నగదు బదిలీ చేయగానే మోసగాళ్లు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. ఇలా వారంరోజుల్లో ముగ్గురు యువకులు రూ.6 లక్షలు మోసపోయారని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు