Nawaz sharif: త్వరలో నవాజ్‌ షరీఫ్‌ శిక్ష రద్దు?

అవినీతి కేసుల్లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు విధించిన శిక్షను రద్దు లేదా సస్పెండ్‌ చేయాలని పాకిస్థాన్‌ కొత్త ప్రభుత్వం యోచిస్తోంది. తనకు తప్పుగా శిక్ష విధించారని కోర్టును ఆశ్రయించేలా...

Updated : 03 May 2022 09:04 IST

పావులు కదుపుతున్న పాకిస్థాన్‌ సర్కారు

ఇస్లామాబాద్‌: అవినీతి కేసుల్లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు విధించిన శిక్షను రద్దు లేదా సస్పెండ్‌ చేయాలని పాకిస్థాన్‌ కొత్త ప్రభుత్వం యోచిస్తోంది. తనకు తప్పుగా శిక్ష విధించారని కోర్టును ఆశ్రయించేలా... ప్రభుత్వం ఆయనకు అవకాశం కల్పించనున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. శిక్షను రద్దు లేదా సస్పెండ్‌ చేసే అధికారం సమాఖ్య, పంజాబ్‌ సర్కారుకు ఉన్నట్టు అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి రానా సనావుల్లా వ్యాఖ్యానించినట్టు డాన్‌ పత్రిక వెల్లడించింది. శిక్షను తప్పుగా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పునర్‌ విచారణను కోరే అవకాశముందని కూడా మంత్రి పేర్కొన్నట్టు తెలిపింది.

చికిత్స నిమిత్తం లండన్‌కు వెళ్లి...

మూడుసార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ అధ్యక్షుడు షరీఫ్‌ (72)పై ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారు పలు అవినీతి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రెండు కేసుల్లో న్యాయస్థానాలు ఆయనకు 2018లో శిక్ష విధించాయి. లండన్‌లో అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న కేసులో పదేళ్లు; సౌదీ అరేబియాలో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కేసులో ఏడేళ్లు జైలు శిక్ష పడింది. శిక్ష అనుభవిస్తుండగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స నిమిత్తం లాహోర్‌ హైకోర్టు నెల రోజులపాటు అనుమతి ఇవ్వగా... 2019, నవంబరులో షరీఫ్‌ లండన్‌ వెళ్లి, ఇప్పటివరకూ తిరిగి రాలేదు! పలుమార్లు ఆదేశించినా ఆయన రాకపోవడంతో కేసుల విచారణను లాహోర్‌ హైకోర్టు నిలిపివేసింది. షరీఫ్‌ తిరిగివస్తే అరెస్టుచేసే అవకాశం ఉన్నందున... తన పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకూ ఆయన వేచి చూస్తూ వచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఇమ్రాన్‌ సర్కారు కూలిపోయి, తన సోదరుడు షెహ్‌బాజ్‌ ప్రధాని పగ్గాలు చేపట్టడంతో... షరీఫ్‌ ఆశలు మళ్లీ చిగురించాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆయనకు పదేళ్ల కాలపరిమితితో కూడిన కొత్త పాస్‌పోర్టును జారీ చేసింది. ప్రతీకార రాజకీయాలకు నవాజ్‌ షరీఫ్‌ బలయ్యారంటూ పీఎంఎల్‌-ఎన్‌ చెబుతూ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని