వచ్చే నెలే.. భారత్‌ ఎస్‌-400 మోహరింపులు

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను వచ్చే నెల(జూన్‌) భారత్‌ మోహరించనుందని అమెరికా రక్షణ శాఖ తన నివేదికలో పేర్కొంది. ఎస్‌-400ల ఒప్పందాన్ని తొలి నుంచీ అమెరికా వ్యతిరేకిస్తోంది. అయితే తమ దేశ

Published : 19 May 2022 05:21 IST

వాషింగ్టన్‌: రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను వచ్చే నెల(జూన్‌) భారత్‌ మోహరించనుందని అమెరికా రక్షణ శాఖ తన నివేదికలో పేర్కొంది. ఎస్‌-400ల ఒప్పందాన్ని తొలి నుంచీ అమెరికా వ్యతిరేకిస్తోంది. అయితే తమ దేశ రక్షణావసరాల రీత్యా ఇవి చాలా కీలకమని భారత్‌ చెబుతూ వస్తోంది. ఇటీవల రష్యా నుంచి తొలి విడత ఎస్‌-400లు చేరుకున్నాయి. వీటిని వచ్చే నెల పాక్‌, చైనా సరిహద్దులకు భారత్‌ పంపనుందని చెప్పిన పెంటగాన్‌.. రష్యాతో ఇండియా సైనిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఉక్రెయిన్‌ సంక్షోభంలో భారత్‌ తటస్థ వైఖరిని అవలంబించిందని పేర్కొనడం గమనార్హం. పాకిస్థాన్‌ రక్షణ సన్నద్ధతపైనా నివేదిక వ్యాఖ్యలు చేసింది. భారత్‌ను చూసి పాక్‌ భయపడుతోందని.. 2022లో ఆ దేశం తన అణ్వాయుధాల ఆధునికీకరణ, విస్తరణపైనే ఎక్కువ దృష్టి పెట్టనుందని నివేదిక తెలిపింది. అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ స్కాట్‌ బెరియర్‌.. ఈ నివేదికను ఇటీవల సెనేట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీతో పంచుకున్నారు. ‘‘భారత్‌ అణు సామర్థ్యం, బలమైన సంప్రదాయ సైనిక శక్తిని చూసి పాక్‌ ఆందోళనకు గురవుతోంది. అణ్వాయుధాల విస్తరణ చేపట్టకపోతే తమ దేశ మనుగడే ప్రమాదమన్న అభిప్రాయంతో ఉంది’’ అని నివేదికలో బెరియర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని