వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కనిపించని పురోగతి

దేశంలోని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద పురోగతి కనిపించలేదు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ బిబేక్‌ డెబ్రాయ్‌ బుధవారం విడుదల చేసిన ‘భారత్‌లో అసమానతల స్థితిగతులపై నివేదిక(ది స్టేట్‌ ఆఫ్‌ ఇనీక్వాలిటీ ఇన్‌ ఇండియా

Published : 19 May 2022 05:21 IST

15 ఏళ్లలో పెరిగినవి 7.47శాతమే
భారత్‌లో అసమానతల స్థితిగతులపై నివేదిక

ఈనాడు, దిల్లీ: దేశంలోని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద పురోగతి కనిపించలేదు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ బిబేక్‌ డెబ్రాయ్‌ బుధవారం విడుదల చేసిన ‘భారత్‌లో అసమానతల స్థితిగతులపై నివేదిక(ది స్టేట్‌ ఆఫ్‌ ఇనీక్వాలిటీ ఇన్‌ ఇండియా రిపోర్టు) ప్రకారం 15 ఏళ్లలో దేశంలో వైద్య ఆరోగ్య కేంద్రాల సంఖ్య 7.47% మాత్రమే పెరిగింది. 2005లో 1,72,608 మేర ఉన్న ఈ ఆరోగ్య కేంద్రాల సంఖ్య 2020 నాటికి 1,85,505కి చేరినట్లు ఈ నివేదిక పేర్కొంది. ప్రభుత్వం మాత్రం దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య సౌకర్యాలు గుర్తించదగ్గ స్థాయిలో మెరుగుపడినట్లు ఈ నివేదికలో అభిప్రాయపడింది. ఈ 15 ఏళ్లలో రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, చండీగఢ్‌లలో ఆరోగ్య కేంద్రాల సంఖ్య బాగా పెరిగినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 5,085మేర తగ్గినట్లు పేర్కొంది. 2005లో ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని లెక్క. 2020 నాటికి విభజిత ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రాలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్యకేంద్రాలు భారీగా తగ్గిపోయినట్లు ఈ నివేదికలో కనిపించింది.

తొలి త్రైమాసికంలో గర్భిణులకు అందించే వైద్యసేవలు 2015-16 నుంచి 2019-21 మధ్యకాలంలో 58.6% నుంచి 70%కి చేరాయి. కాన్పు అయిన రెండు రోజుల్లోపు సగటున 79.1% మంది పిల్లలకు డాక్టర్లు, నర్సుల ద్వారా వైద్యసేవలు అందుతున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ 5, తెలంగాణ 10వ స్థానంలో ఉన్నాయి. ఇదే సమయంలో కాన్పు తర్వాత రెండు రోజుల్లోపు 78% మహిళలకు వైద్యసేవలు అందుతున్నాయి. ఈ విషయంలో ఏపీ 8, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి.


పట్టణ నిరుద్యోగులకు ఉపాధి పథకం

ట్టణ ప్రాంత నిరుద్యోగులను ఆదుకొనేలా వారి ఉపాధికి హామీ ఇచ్చే పథకాన్ని ప్రారంభించాలని, తద్వారా సార్వత్రిక కనీస ఆదాయం సాధించాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. అదేవిధంగా దేశంలో అసమానతలను తగ్గించడానికి సామాజిక రంగానికి అధిక నిధులు కేటాయించాలని, తద్వారా పేదలు పెరగకుండా చూడవచ్చని సూచించింది. దేశంలోని అసమానతలపై ఈ నివేదిక దృష్టి పెట్టింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కార్మికశక్తి భాగస్వామ్యంలోని తేడాలను ఎత్తిచూపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని