తొలిసారి శ్రీలంక రుణ ఎగవేత!

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను కష్ట నష్టాలు, సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దేశచరిత్రలో తొలిసారి శ్రీలంక రుణం చెల్లించడంలో విఫలమైంది. ఈ శతాబ్దంలోనే ఓ ఆసియా-పసిఫిక్‌ దేశం రుణాన్ని ఎగవేయడం ఇదే తొలిసారి అని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది.

Published : 21 May 2022 06:13 IST

ద్వీపదేశాన్ని వెంటాడుతున్న కష్టాలు
ఇంధన కొరత తీవ్రం

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను కష్ట నష్టాలు, సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దేశచరిత్రలో తొలిసారి శ్రీలంక రుణం చెల్లించడంలో విఫలమైంది. ఈ శతాబ్దంలోనే ఓ ఆసియా-పసిఫిక్‌ దేశం రుణాన్ని ఎగవేయడం ఇదే తొలిసారి అని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది. శ్రీలంక 78 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 605 కోట్లు) రుణ వడ్డీ చెల్లింపులకు సంబంధించి 30 రోజుల అదనపు గడువు (గ్రేస్‌ పీరియడ్‌) కూడా బుధవారంతో తీరిపోయింది. దీంతో ఈ దేశం రుణాన్ని ఎగవేసినట్లు ప్రపంచంలో రెండు అతిపెద్ద క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు గురువారం ప్రకటించాయి. అయితే శ్రీలంక మాత్రం దీన్ని ‘ముందస్తు దివాలా’గా చెబుతోంది. ‘‘అదనపు గడువు తర్వాత రెండు సావరిన్‌ బాండ్లకు సంబంధించి వడ్డీ చెల్లింపులు చేయలేకపోవడంతో దేశం ‘ముందస్తు దివాలా’లో పడింది’’ అని శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ పి.నందలాల్‌ వీరసింఘే పేర్కొన్నారు. ‘‘మా పరిస్థితి విస్పష్టం. రుణాల పునర్వ్యవస్థీకరణ చేసేంతవరకు చెల్లింపులు చేయలేమని చెప్పాం. దీన్ని వారు సాంకేతికంగా ఎగవేతగా నిర్వచిస్తారు’’ అని చెప్పారు. ప్రభుత్వాలు కొన్ని లేదా అన్ని రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైనప్పుడు దాన్ని ఎగవేతగా గుర్తిస్తారు. ఇలాంటి సమయాల్లో పెట్టుబడులకు సంబంధించి ఆ దేశ పేరుప్రతిష్ఠలు దెబ్బతింటాయి. ఆ దేశ కరెన్సీ, ఆర్థికరంగంపై విశ్వాసం సన్నగిల్లుతుంది.

స్కూళ్ల మూసివేత..
తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో శ్రీలంకలో శుక్రవారం అన్ని పాఠశాలలు మూసివేశారు. అత్యవసర సేవలు అందించే వారు తప్ప అధికారులెవరూ విధులకు కూడా రావొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల వద్ద వేలసంఖ్యలో ప్రజలు రోజుల తరబడి వేచి ఉంటున్నారు. గ్యాస్‌, ఇంధన కొరతను తీర్చాలని డిమాండ్‌ చేస్తూ పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నారు.

కొత్తగా 9 మంది మంత్రులు..
శ్రీలంకలో 9 మంది కొత్త మంత్రులతో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమసింఘేను గొటబాయ ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. కొత్త మంత్రుల్లో ప్రధాన ప్రతిపక్షం సామగి జన బలవేగయ (ఎస్‌జేబీ) నుంచి ఇద్దరిని తీసుకున్నారు. మిగతావారంతా రాజపక్స సొంతపార్టీ ఎస్‌ఎల్‌పీపీకి చెందినవారే. గత వారం నలుగురు మంత్రులను గొటబాయ నియమించారు. కాగా ఇంతవరకు ఆర్థికమంత్రిగా ఎవరినీ నియమించలేదు. మంత్రి పదవులు తీసుకున్న తమ పార్టీకి చెందిన ఇద్దరి (ఫెర్నాండో, ననయక్కర) పైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు ఎస్‌జేబీ శుక్రవారం తెలిపింది. అనంతరం వారిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ తాము స్వతంత్ర ఎస్‌జేబీ సభ్యులమని, దేశ ప్రయోజనాల దృష్ట్యానే మంత్రివర్గంలో చేరామని ప్రకటించారు.

జీ-7 ఆపన్నహస్తం..
శ్రీలంకకు రుణభారం నుంచి ఉపశమనం కలిగేలా సహకారం అందిస్తామంటూ జీ-7 దేశాలు చేసిన ప్రకటనను ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే శుక్రవారం స్వాగతించారు. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు జీ-7 కూటమిలో ఉన్నాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సహకారం ఎంతో కీలకమని విక్రమసింఘే పేర్కొన్నారు. మరోవైపు జపాన్‌ శుక్రవారం శ్రీలంకకు 1.5 మిలియన్‌ డాలర్ల (రూ. 11.64 కోట్లు) ఆర్థికసాయాన్ని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని