శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత

కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో రెండు వారాల క్రితం విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వం ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో

Updated : 22 May 2022 09:18 IST

కొలంబో: కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో రెండు వారాల క్రితం విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వం ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రెండోసారి ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగవుతున్న నేపథ్యంలో.. ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు అధ్యక్ష సచివాలయం తాజాగా ప్రకటన చేసింది. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో పోలీసులు, భద్రత దళాలకు విశేష అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజలెవరినైనా కారణం చెప్పకుండా అరెస్టు చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి వారికి అధికారం ఉంటుంది.

40,000 టన్నుల డీజిల్‌ పంపించిన భారత్‌..

శ్రీలంకకు ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్న భారత్‌ మరో 40,000 టన్నుల డీజిల్‌ను శనివారం సరఫరా చేసింది. రుణ సాయాన్ని పొడిగించడంలో భాగంగా భారత్‌ డీజిల్‌ను అందజేసింది. అలాగే బియ్యం, ఔషధాలు, పాలపొడి వంటి అత్యవసర ఉపశమన సామగ్రితో భారత్‌ (చెన్నై) నుంచి ఓ నౌక కూడా శుక్రవారం బయల్దేరింది. ఇందులో దాదాపు రూ. 45 కోట్ల విలువైన.. 9,000 టన్నుల బియ్యం, 200 టన్నుల పాలపొడి, 24 టన్నుల ప్రాణాధార ఔషధాలు ఉన్నాయి.

జపాన్‌ ‘ఆహార’ సాయం..

ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా శ్రీలంకకు 1.5 మిలియన్‌ డాలర్ల (రూ. 11.67 కోట్ల) విలువైన అత్యవసర సాయాన్ని జపాన్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఫోర్టిఫైడ్‌ బియ్యం, పప్పులు, నూనె వంటివాటిని పంపించనున్నట్లు తెలిపింది. దాదాపు 15,000 మంది పట్టణ, గ్రామీణ ప్రజలు; 3.80 లక్షల మంది బడిపిల్లల కోసం వీటిని పంపుతున్నట్లు ప్రకటించింది. శ్రీలంక తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోనుందంటూ ఇటీవల ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని