తలపడి తలవంచిన మేరియుపొల్‌

పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌పై సాగించిన యుద్ధం ఒకెత్తయితే, అందులో తీరనగరం మేరియుపొల్‌లో సాగిన ఘట్టం మరొకెత్తు! ఫిబ్రవరి 24న సైనికచర్యకు దిగింది మొదలు... రష్యా ప్రధానంగా దృష్టి సారించిన తీర ప్రాంతం- మేరియుపొల్‌!

Updated : 22 May 2022 07:35 IST

కడవరకూ ధీశక్తితో పోరాడిన ఉక్రెయిన్‌ సేనలు
చరిత్రలో నిలిచిపోయే యుద్ధ ఘట్టమంటూ నిపుణుల వ్యాఖ్యలు

కీవ్‌: పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌పై సాగించిన యుద్ధం ఒకెత్తయితే, అందులో తీరనగరం మేరియుపొల్‌లో సాగిన ఘట్టం మరొకెత్తు! ఫిబ్రవరి 24న సైనికచర్యకు దిగింది మొదలు... రష్యా ప్రధానంగా దృష్టి సారించిన తీర ప్రాంతం- మేరియుపొల్‌! అక్కడున్న అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారాన్ని చేజిక్కించుకునేందుకు మాస్కో చెమటోడ్చక తప్పలేదు. నువ్వా-నేనా అన్నట్టు సాగిన పోరాటంలో చివరకు ఉక్రెయిన్‌ సేనలు చేతులెత్తేశాయి. శత్రు బలగాల నుంచి ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు చివరి వరకూ ప్రయత్నించి, లొంగిపోయిన 2,439 మందిని రష్యా తన దేశానికి తరలించింది. ఇన్ని రోజులుగా అలుపెరగని పోరాటం సాగించిన ఈ యోధులు ఎవరన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది.

పోరాటమే ఊపిరిగా...

వారాల తరబడి సాగిన భీకర పోరాటంలో మేరియుపొల్‌ తన అందాలను కోల్పోయింది. నగరంలో ఎక్కడ చూసినా శిథిలాలు, బూడిద, అక్కడక్కడ మంటలు, వాటి నుంచి ఎగిసిపడుతున్న పొగలే కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌ నేషనల్‌ గార్డ్‌కు చెందిన అజోవ్‌ రెజిమెంట్‌, నావికా దళానికి చెందిన 36వ ప్రత్యేక మెరైన్‌ బ్రిగేడ్‌, నేషనల్‌ గార్డ్‌కు చెందిన 12వ బ్రిగేడ్‌, సరిహద్దు భద్రతా దళం, పోలీసు అధికారులు, ప్రాదేశిక భద్రతా సిబ్బంది మేరియుపొల్‌లో మోహరించారు. పుతిన్‌ సేనలతో నెల రోజులకు పైగా పోరాడిన 36వ బ్రిగేడ్‌... ఆ తర్వాత అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారానికి చేరుకుని, అక్కడ అజోవ్‌ రెజిమెంట్‌ సైనికులతో కలిసి పోరాటాన్ని కొనసాగించింది. అయితే, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయుధాలు చేతపట్టిన సామాన్యులు కూడా ఇక్కడ పెద్దసంఖ్యలో మోహరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. రష్యాకు చిక్కినవారిలో వీరు కూడా ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

సజీవంగా ఉండటం అవసరమనే...

బలమైన శత్రువుతో ఉక్కు కర్మాగారం వద్దనున్న తమ సైనికులు ధీశక్తితో పోరాడుతూ వచ్చారని ప్రశంసించిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ- దేశం కోసం ఉక్రెయిన్‌ హీరోలు సజీవంగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోరాటాన్ని ముగించాలని వారికి ఆదేశించినట్టు చెబుతున్నారు.

21వ శతాబ్దపు ‘థర్మోపైలే’గా నిలిచిపోతుంది...

ఫలితంతో సంబంధం లేకుండా, రష్యాను మూడు చెరువుల నీళ్లు తాగించిన యోధులుగా ఉక్రెయిన్‌ పోరాటయోధులు నిలిచిపోతారని యుద్ధ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 21వ శతాబ్దపు థర్మోపైలేగా మేరియుపొల్‌ శాశ్వతంగా నిలిచిపోతుందని జెలెన్‌స్కీ సలహాదారుడు మైఖేలో పోడోలాక్‌ అభివర్ణించారు. చరిత్రలో అత్యంత గొప్పగా పోరాడి, ఓడిన యుద్ధరంగాల్లో ఒకటి... థర్మోపైలే! క్రీస్తుపూర్వం 480వ సంవత్సరంలో శక్తిమంతమైన పర్షియన్‌ సైన్యాన్ని కేవలం 300 మంది స్పార్టాన్లు థర్మోపైలే అనే స్థలం వద్ద తమ ధీశక్తితో సమర్థంగా అడ్డుకుంటూ వచ్చారు. చివరికి తమ రాజుతో సహా శత్రువుల చేతిలో వీరమరణం పొందారు.

అజోవ్‌ రెజిమెంట్‌పై ‘నాజీ ముద్ర’

ఉక్కు కర్మాగారం వద్ద లొంగిపోయిన అజోవ్‌ రెజిమెంట్‌ సైనికులపై ‘నాజీ’ ముద్ర వేసేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. కర్మాగారం బేస్మెంటులో తలదాచుకున్న సామాన్యులపై వారి కమాండర్‌ దురాగతాలకు పాల్పడ్డాడని, స్థానికులు ఈ విషయం చెప్పడంతో అతడిని సాయుధ వాహనంలో తరలించామని చెబుతోంది. అయితే, బేస్మెంట్లలో తలదాచుకున్న వందల మంది ఉక్రెయిన్లలో ఒక్కరు కూడా ఆ కమాండర్‌పై ఆరోపణలూ చేయలేదు. పైగా, అజోవ్‌ సైనికులు అక్కడున్న చిన్నారులకు మిఠాయిలు పంచుతున్న వీడియోలు కూడా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని