ఎన్నెన్నో ఎన్‌కౌంటర్‌ కథలు

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఎస్‌.సిర్పుర్కర్‌ నేతృత్వంలోని కమిషన్‌ తప్పుబట్టడంతో.. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో జరిగిన ఇలాంటి పలు

Updated : 23 May 2022 10:16 IST

పదేపదే తప్పుబట్టిన కోర్టులు, కమిషన్లు

పలు కేసుల్లో పోలీసులకు జైలు శిక్ష

అయినా ఆగని ఘటనలు

దిశ కేసులో ఎన్‌కౌంటర్‌తో మళ్లీ తెరపైకి

దిల్లీ: దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఎస్‌.సిర్పుర్కర్‌ నేతృత్వంలోని కమిషన్‌ తప్పుబట్టడంతో.. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో జరిగిన ఇలాంటి పలు ఎన్‌కౌంటర్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. దిశ కేసులో జరిగిన ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ముగ్గురు మైనర్లు కావడం.. పోలీసు సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని కమిషన్‌ తేల్చడంతో ఈ ఘటనపై భిన్నరకాల స్పందనలు వచ్చాయి. గతంలోనూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలాగే జరిగిన కొన్ని ఎన్‌కౌంటర్లను వివిధ కమిషన్లు తప్పుబట్టాయి.

* 2003లో నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఇతర భాజపా నేతలపై దాడికి కుట్ర పన్నుతున్నాడన్న సమాచారంతో గుజరాత్‌ పోలీసులు సాదిక్‌ జమాల్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో కీలకపాత్ర పోషించినట్లు తర్వాత సీబీఐ దర్యాప్తులో తేలింది. చాలామంది పోలీసు ఇన్‌స్పెక్టర్లు, ఐబీ ఉన్నతాధికారులను నిందితులుగా చేర్చారు.

* 2006లో సోహ్రబుద్దీన్‌షేక్‌ అనుచరుడైన తులసీరామ్‌ ప్రజాపతి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. గుజరాత్‌ పోలీసులు సోహ్రబుద్దీన్‌ షేక్‌, కౌసర్‌ బీ దంపతులను పట్టుకున్నప్పుడు ప్రజాపతి కూడా వాళ్లతోనే ఉన్నాడని సీబీఐ తెలిపింది. అతడిని రాజస్థాన్‌లో అరెస్టు చేసినట్లు చూపించి, తర్వాత ఎన్‌కౌంటర్‌ చేశారు. సోహ్రబుద్దీన్‌ షేక్‌ను 2005లో గుజరాత్‌, రాజస్థాన్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. అతడి భార్య కౌసర్‌బీ అదృశ్యమైంది. ఆమెనూ పోలీసులే అంతం చేసినట్లు ఆరోపణలొచ్చాయి. 2018లో ఈ కేసులో ఉన్న 21 మంది పోలీసులు సహా మొత్తం 22 మందినీ ముంబయిలోని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది.

* 2004లో గుజరాత్‌ పోలీసులు ఇష్రత్‌ జహాన్‌, జావేద్‌ షేక్‌, అమ్జాద్‌ అలీ అక్బర్‌ అలీ రాణా, జీషన్‌ జోహర్‌లను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఆ నలుగురూ ఉగ్రవాదులని, నాటి గుజరాత్‌ సీఎం మోదీని హతమార్చే కుట్ర చేస్తున్నారని పోలీసులు ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌ కట్టుకథేనని హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. కానీ ప్రత్యేక కోర్టు మాత్రం 2021లో ముగ్గురు పోలీసు అధికారులను విడుదల చేసింది.

* 2006లో గ్యాంగ్‌స్టర్‌ చోటా రాజన్‌ అనుచరుడైన రామ్‌ నారాయణ్‌ గుప్తా అలియాస్‌ లాఖన్‌ భయ్యాను ముంబయి పోలీసులు వెర్సోవాలో ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ కేసులో 13 మంది పోలీసులు సహా 21 మందికి ముంబయి సెషన్స్‌ కోర్టు 2013లో జీవితఖైదు శిక్ష విధించింది. నిందితుల్లో ఒకరైన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు ప్రదీప్‌ శర్మను మాత్రం నిర్దోషిగా విడిచిపెట్టారు.

* 2009లో దేహ్రాదూన్‌లో రణ్‌బీర్‌సింగ్‌ అనే ఎంబీయే విద్యార్థిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురు పోలీసులకు దిగువ కోర్టు విధించిన జీవితఖైదు శిక్షను దిల్లీ హైకోర్టు 2018లో ఖరారు చేసింది. ఇది చాలా బాధాకరమైన ఘటన అని వ్యాఖ్యానించింది.

* 1997 మార్చి 31న దిల్లీలోని కనాట్‌ప్లేస్‌లో బారాఖంబా జంక్షన్‌ వద్ద వెళ్తున్న నీలిరంగు సెడాన్‌ కారుపై పది మంది క్రైంబ్రాంచి పోలీసులు కాల్పులు జరిపి, అందులో ఉన్న ముగ్గురిలో జగ్జీత్‌ సింగ్‌, ప్రదీప్‌ గోయల్‌ అనే ఇద్దరి మృతికి కారకులయ్యారు. నిజానికి మొహమ్మద్‌ యాసీన్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ కూడా నీలిరంగు సెడాన్‌ కారులో అటు వైపు వెళ్తున్నాడనే సమాచారంతో ఈ కాల్పులు జరిపారు. పదిమంది పోలీసులు దోషులుగా తేలడంతో వారికి జీవితఖైదు విధించారు. 2020 అక్టోబరులో వారిని విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని