ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నంతో మానవాళికి తీవ్ర ముప్పు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం వల్ల మానవాళికి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ‘చీఫ్‌ ఎకానమిస్ట్స్‌ ఔట్‌లుక్‌’ నివేదిక హెచ్చరించింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు

Published : 24 May 2022 05:13 IST

 హెచ్చరించిన డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక

దావోస్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం వల్ల మానవాళికి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ‘చీఫ్‌ ఎకానమిస్ట్స్‌ ఔట్‌లుక్‌’ నివేదిక హెచ్చరించింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు రుణ సంక్షోభం... ఆహార, ఇంధన భద్రతల నడుమ అసమతుల్యతను ఎదుర్కోవాల్సి రావచ్చని అప్రమత్తం చేసింది. దక్షిణాసియా, ఉత్తర ఆఫ్రికా, సబ్‌-సహారన్‌ ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో ఆహార భద్రతకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొంది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా తక్కువ ఆర్థిక కార్యకలాపాలు, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వాస్తవ వేతనాలు, తీవ్రస్థాయిలో ఆహార అభద్రత నెలకొంటాయని ప్రధాన ఆర్థిక వేత్తలు అంచనా వేసినట్టు తెలిపింది. డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సమావేశంలో భాగంగా ఈ నివేదికను విడుదల చేశారు.

‘‘సమాజాలపై ఏళ్ల తరబడి ప్రభావంచూపే భిన్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌లో యుద్ధం వెరసి... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అవి సృష్టించిన పరిణామాలు... 30 ఏళ్లలో సాధించిన ప్రయోజనాలను తుడిచిపెట్టేసేలా ఉన్నాయి’’ అని ప్రపంచ ఆర్థిక వేదిక మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాదియా జాహిదీ అన్నారు. ఈ ఏడాది చివరినాటికి గోధుమల ధరలు 40 శాతానికిపైగా పెరుగుతాయనీ; కూరగాయలు, నూనెలు, ధాన్యాలు, మాంసం ధరలు కూడా ఎగబాకుతాయనీ... దీంతో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వాస్తవ వేతనాలు సమీప భవిష్యత్తులో తగ్గుతాయని మూడింట రెండొంతుల మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అల్పాదాయ దేశాల్లో వాస్తవ ఆదాయం తగ్గుతుందని 90% మంది నిపుణులు పేర్కొన్నారు. పారిస్‌ కేంద్రంగా పనిచేసే బహుళజాతి మార్కెట్‌ పరిశోధన సంస్థ ఇప్సోస్‌తో కలిసి ప్రపంచ బ్యాంకు 11 దేశాల్లో చేసిన సర్వే కూడా- సమీప భవిష్యత్తులో జీవన వ్యయ సంక్షోభం కారణంగా ప్రజల్లో ఆర్థిక నిరాశ నెలకొంటుందని అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని