వాయు కాలుష్యం పెరిగితే గుండె లయలో తేడాలు!

తీవ్రస్థాయి వాయు కాలుష్యం బారినపడితే ప్రాణాంతక గుండె సమస్య తలెత్తవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. దీనివల్ల హృదయ స్పందనల్లో తేడాలు వస్తాయని తెలిపింది. ఇటలీలోని పియాసెంజా ఆసుపత్రి నిపుణులు ఈ పరిశోధన నిర్వహించారు.

Updated : 24 May 2022 05:58 IST

లండన్‌: తీవ్రస్థాయి వాయు కాలుష్యం బారినపడితే ప్రాణాంతక గుండె సమస్య తలెత్తవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. దీనివల్ల హృదయ స్పందనల్లో తేడాలు వస్తాయని తెలిపింది. ఇటలీలోని పియాసెంజా ఆసుపత్రి నిపుణులు ఈ పరిశోధన నిర్వహించారు.

వాతావరణ కాలుష్యం వల్ల ఏటా 42లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనావేస్తోంది. గుండె జబ్బులతో మరణించే ప్రతి ఐదుగురిలో ఒకరు.. వాయు కాలుష్యం వల్లే బలవుతున్నారని శాస్త్రవేత్తలు తేల్చారు. అధిక రక్తపోటు, పొగాకు వినియోగం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల తర్వాత వాయు కాలుష్యమే పెను ప్రమాదకారిగా మారినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటలీ శాస్త్రవేత్తలు ఇంప్లాంటబుల్‌ కార్డియోవెర్టర్‌ డిఫిబ్రిలేటర్‌ (ఐసీడీ) అమర్చిన 146 మంది రోగులను పరీక్షించారు. వీరిలో 93 మందికి గుండె వైఫల్యం చెందింది. మిగతా 53 మందికి జన్యు లేదా ఇన్‌ఫ్లమేటరీ గుండె సమస్య ఉంది. ఆ ప్రాంతంలోని వాయు కాలుష్యం స్థాయికి, ఈ రోగుల గుండె స్పందనల్లో వచ్చే తేడాలకు మధ్య సంబంధాన్ని పరిశోధకులు విశ్లేషించారు.

* గాల్లో కాలుష్యకారక ‘పీఎం 2.5’ రేణువులు.. చదరపు మీటరుకు ఒక మైక్రోగ్రాము మేర పెరిగినా గుండె లయలో తేడా వచ్చే ప్రమాదం 1.5 శాతం మేర పెరుగుతున్నట్లు తేల్చారు. వారం మొత్తం ఇదే పరిమాణంలో ఈ రేణువులు ఉంటే.. ఈ ముప్పు 2.4 శాతం పెరుగుతుందని గుర్తించారు.

* ‘పీఎం 10’ రేణువులు చదరపు మీటరు విస్తీర్ణంలో ఒక మైక్రోగ్రాము మేర పెరిగినా గుండె స్పందనలో తేడాల ముప్పు 2.1 శాతం మేర పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

* పీఎం రేణువుల వల్ల గుండె కండరాల్లో తీవ్ర ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తవచ్చని, ఇది అంతిమంగా హృదయ స్పందనల్లో తేడాలకు దారితీయవచ్చని పరిశోధకులు తెలిపారు.

* వాతావరణంలో పీఎం 2.5 రేణువుల తీవ్రత క్యూబిక్‌ మీటరుకు 35 మైక్రోగ్రాములు, పీఎం 10 రేణువుల స్థాయి 50 మైక్రోగ్రాముల కన్నా పెరిగితే ఐసీడీ రోగులు ఇళ్లకే పరిమితం కావడం లేదా ఎన్‌95 మాస్కు ధరించడం ఉత్తమమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇళ్లలోనూ గాలి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని