Published : 25 May 2022 05:51 IST

మోదీ ‘భారత్‌’లో కొందరికే చోటు

కొన్ని వర్గాలను రాక్షసంగా దూరం చేస్తున్నారు
దేశ లౌకిక పునాదులపై దాడి జరుగుతోంది
భాజపా, ఆరెస్సెస్‌లపై రాహుల్‌ ధ్వజం

కేంబ్రిడ్జ్‌: ప్రధాని మోదీ నిర్మించాలనుకుంటున్న భారత్‌లో అందరికీ చోటులేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కొన్ని వర్గాలను కావాలనే రాక్షసంగా దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది దేశ లౌకిక భావనలకే విరుద్ధమని పేర్కొన్నారు. యూకే పర్యటనలో ఉన్న రాహుల్‌.. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో కార్పస్‌ క్రిస్టీ కాలేజ్‌ నిర్వహించిన ‘ఇండియా ఎట్‌ 75’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో సంభాషించారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మోదీ, ఆరెస్సెస్‌పై విరుచుకుపడ్డారు. ‘‘మోదీ సృష్టించాలనుకుంటున్న భారత్‌లో అన్ని ప్రాంతాల ప్రజలకు స్థానం లేదు. కొందరిని పక్కన పెడుతున్నారు. లౌకిక భావనలకు ఇది విరుద్ధం. భాజపా, ఆరెస్సెస్‌ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయి. రాక్షసంగా 20 కోట్ల మంది ప్రజలను ఒంటరి చేస్తున్నాయి. ఇది దారుణం. ప్రశ్నించినపుడే భారత్‌ సజీవంగా ఉన్నట్లు, నిశ్శబ్దంగా ఉంటే మృతి చెందినట్లే. కానీ మాట్లాడడానికి అనుమతిచ్చే పార్లమెంట్‌, ఎన్నికల సంఘం సహా పలు వ్యవస్థలపై ఓ క్రమపద్థతిలో దాడి జరుగుతోంది. వాటిని ఓ సంస్థ తన అధీనంలోకి తీసుకుంది. హిందూ జాతీయవాదం అనే పదాన్ని అంగీకరించను. ఎందుకంటే దాంతో హిందువులకు ఎలాంటి సంబంధం లేదు. హిందూయిజాన్ని నేను పరిశీలనాత్మకంగా అధ్యయనం చేశాను. అందులో ప్రజలను చంపాలనుకోవడం, కొట్టాలనుకోవడం ఎక్కడా లేదు. మేం ఓ రాజకీయ పార్టీతో పోరాడటం లేదు. దేశాన్ని కబ్జా చేసిన వారితో యుద్ధం చేస్తున్నాం. కాబట్టి సమయం పడుతుంది. కష్టమైన పని కూడా. కానీ మేం చేస్తున్నాం’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణంపై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆ సంఘటన తనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని అన్నారు.

లేబర్‌ పార్టీ ఎంపీతో ఫోటో..రాహుల్‌పై భాజపా విమర్శలు
యూకే పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ.. బ్రిటన్‌ లేబర్‌ పార్టీ ఎంపీ జెరేమీ కార్బిన్‌తో దిగిన ఫోటో వివాదాస్పదమైంది. కార్బిన్‌.. భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు తరచుగా చేస్తూ ఉంటారు. దీంతో లేబర్‌ ఎంపీ వ్యక్తపరిచే అభిప్రాయాలను కాంగ్రెస్‌ సమర్థిస్తుందా అంటూ భాజపా ప్రశ్నించింది. కాంగ్రెస్‌.. ఎదురుదాడి చేసింది. గతంలో కార్బిన్‌తో మోదీ దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. దీనికేం సమాధానం చెబుతారంటూ భాజపాను నిలదీసింది.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts