కుతుబ్‌మినార్‌లో పూజలు చేయడం కుదరదు

కుతుబ్‌మినార్‌లో హిందూ, జైన విగ్రహాల పూజలకు అనుమతించాలని కోరుతూ దిల్లీ కోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని భారత పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) వ్యతిరేకించింది. అది పూజలు చేయడానికి సంబంధించిన ప్రాంతం కాదని

Published : 25 May 2022 06:12 IST

భారత పురావస్తుశాఖ స్పష్టీకరణ

దిల్లీ: కుతుబ్‌మినార్‌లో హిందూ, జైన విగ్రహాల పూజలకు అనుమతించాలని కోరుతూ దిల్లీ కోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని భారత పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) వ్యతిరేకించింది. అది పూజలు చేయడానికి సంబంధించిన ప్రాంతం కాదని, 800 ఏళ్లనాటి ఆ స్మారక చిహ్నం ప్రస్తుత స్థితిని ఏమాత్రం మార్చలేమని స్పష్టంచేసింది. రక్షిత స్మారక చిహ్నంలో పూజించే హక్కును అంగీకరిస్తే... అది వివాదాస్పదం, చట్ట వ్యతిరేకం అవుతుందని కోర్టుకు తెలిపింది. ‘27 ఆలయాల శిథిలాలను మినార్‌ కాంప్లెక్సులోని మసీదు నిర్మాణంలో వాడినట్లు పర్షియన్‌ భాషలో ఉన్న శిలాఫలకంపై రాసి ఉంది. ఆలయాలను కూల్చి శిథిలాలను తీసుకున్నట్లు మాత్రం ఎక్కడా రాయలేదు. స్మారకచిహ్నంలో పూజలకు అనుమతించడం పురాతన స్మారకాలు, పురావస్తు స్థలాలు, శిథిలాల పరిరక్షణ చట్టం ప్రకారం కుదరదు’ అని స్పష్టం చేసింది. ‘రక్షిత స్మారక చిహ్నాన్ని ఆలయంగా మార్చాలని కోరుకొంటున్నారు. 800 ఏళ్లనాడు జరిగినదాన్ని ఇప్పుడు పునరుద్ధరించాలని ఎలా అడుగుతారు? అని పిటిషనర్‌ను జడ్జి ప్రశ్నించారు. పిటిషనర్‌ స్పందిస్తూ... ‘ఏదైనా ప్రాంతం ఒకసారి దేవుడి ఆస్తిగా మారితే.. అది ఎప్పటికీ దేవుడిదే. దాన్ని ఎవరూ మార్చలేరు’ అని స్పష్టం చేశారు. వాదనల అనంతరం కేసు విచారణను జూన్‌ 9కి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు కుతుబ్‌ మినార్‌లోని కువ్వతుల్‌ ఇస్లాం మసీదులో తమకు నమాజులు చేసుకోవడానికి అనుమతించాలని దిల్లీ వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు అమానతుల్లా ఖాన్‌ ఏఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌కు విన్నవించారు. ఏఎస్‌ఐ సూచనతోనే గతంలో తాము నమాజులను నిలిపేసినట్లు గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని