Updated : 25 May 2022 06:19 IST

క్వాడ్‌కు పోటీగా డ్రాగన్‌ పసిఫిక్‌ వ్యూహం?

సాలమన్‌ దీవుల్లో వాంగ్‌ యి పర్యటన  
పలు ఇతర పసిఫిక్‌ ద్వీపదేశాల సందర్శనకూ రంగం సిద్ధం

బ్యాంకాక్‌: పసిఫిక్‌ మహాసముద్రంలోని సాలమన్‌ దీవుల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి ఈ వారం పర్యటించనున్నారు. హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లో చైనా దూకుడుకు ముకుతాడు వేయడానికి ఏర్పడిన క్వాడ్‌ కూటమి దేశాధినేతలు టోక్యోలో సమావేశమైన సమయంలోనే వాంగ్‌ పర్యటన వార్త వెలువడటం విశేషం. చైనా, సాలమన్‌ దీవుల మధ్య ఏప్రిల్‌లో భద్రతా ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం.. సాలమన్‌ దీవుల్లో శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడటానికి చైనా పోలీసు, సైనిక సిబ్బందిని పంపుతుంది. చైనా యుద్ధనౌకలు అక్కడ నీరు, ఆహారం, ఇతర సరకులు నింపుకోవడానికి వీలుంటుంది. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల వాకిట్లోనే చైనా నౌకాస్థావరం ఏర్పడబోతోందని ఆందోళన రేగుతోంది. అయితే, చైనాతో ఒప్పందం తమ దేశ ఆంతరంగిక భద్రత పరిరక్షణకు ఉద్దేశించినదనీ, ఇతర దేశాలకు వ్యతిరేకం కాదని సాలమన్‌ దీవుల ప్రధానమంత్రి మనస్సే సొగవరే వివరిస్తున్నారు. త్వరలోనే న్యూజిలాండ్‌ ప్రతినిధి వర్గమూ తమ దేశానికి రానుందని చెబుతున్నారు. ఏప్రిల్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రతినిధి వర్గాలకూ తాను ఆహ్వానం పలికానన్నారు. వాంగ్‌ యి పర్యటన తమ రెండు దేశాల సంబంధాలలో గొప్ప మైలురాయి అవుతుందనీ, ఈ యాత్రలో పలు ఒప్పందాలు కుదురుతాయనీ సొగవరే మంగళవారం ప్రకటించారు. చైనాతో భద్రతా ఒప్పందం ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్‌లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో తైవాన్‌ను సాధికారంగా గుర్తించిన సాలమన్‌ దీవుల ప్రభుత్వం 32 నెలల క్రితం తన గుర్తింపును తైవాన్‌ నుంచి చైనాకు మార్చింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. చైనా విదేశాంగ మంత్రి సాలమన్‌ దీవులతోపాటు పసిఫిక్‌ మహాసముద్రంలోని ఇతర ద్వీపదేశాలనూ సందర్శించనున్నారు. మొత్తం 10 రోజుల పర్యటనలో ఫిజి, పపువా న్యూగినియా, టోంగా, ఈస్ట్‌ టైమర్‌, కిరిబాటి, సమోవా, వనవటు వంటి ద్వీప దేశాల్లోనూ ఆయన పర్యటిస్తారు. ఫిజిలో ఆ ద్వీపదేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమవుతారు. చైనాతో భద్రతా ఒప్పందం కుదుర్చుకోవద్దనీ, దీనివల్ల యావత్‌ పసిపిక్‌ ప్రాంతంపై విస్తృత ప్రభావం పడుతుందని అమెరికా, ఆస్ట్రేలియాలు సాలమన్‌ దీవుల సర్కారుకు నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది.

స్వదేశానికి మోదీ పయనం

టోక్యో: జపాన్‌లో రెండు రోజుల పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ మంగళవారం స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. టోక్యోలో క్వాడ్‌ నేతలు, జపాన్‌ వ్యాపారవేత్తలతో తన చర్చలు అద్భుతంగా సాగాయని ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని