బాల్యం నుంచే యాసిన్‌ దేశ వ్యతిరేక కార్యకలాపాలు

కశ్మీరీ వేర్పాటువాదుల్లో కీలక నేత యాసిన్‌ మాలిక్‌... శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో 1966 ఏప్రిల్‌ 3న జన్మించాడు. 14 ఏళ్ల వయసు నుంచే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. తాలా పార్టీని స్థాపించి 1983లో శ్రీనగర్‌లోని షేర్‌ ఎ కశ్మీర్‌

Updated : 26 May 2022 06:23 IST

దిల్లీ: కశ్మీరీ వేర్పాటువాదుల్లో కీలక నేత యాసిన్‌ మాలిక్‌... శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో 1966 ఏప్రిల్‌ 3న జన్మించాడు. 14 ఏళ్ల వయసు నుంచే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. తాలా పార్టీని స్థాపించి 1983లో శ్రీనగర్‌లోని షేర్‌ ఎ కశ్మీర్‌ స్టేడియంలో నిర్వహించిన భారత్‌, వెస్టిండీస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. జేకేఎల్‌ఎఫ్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ మఖ్బూల్‌ భట్‌ను తిహార్‌ జైలులో 1984 ఫిబ్రవరిలో ఉరితీయగా నిరసన చేపట్టాడు. తాలా పార్టీ ఆ తర్వాత కాలంలో ఇస్లామిక్‌ స్టూడెంట్స్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)గా మారింది. 1988లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లిన మాలిక్‌ ఆయుధ శిక్షణ పొందడంతో పాటు జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(జేకేఎల్‌ఎఫ్‌)లో చేరాడు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను, భారత్‌లోని కశ్మీర్‌ను ఏకం చేయాలనేది ఈ ఫ్రంట్‌ లక్ష్యం. కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి ముఫ్తీమహమ్మద్‌ సయీద్‌ కుమార్తె రుబైయా సయీద్‌ను 1989లో కిడ్నాప్‌ చేసిన కేసులో యాసిన్‌ మాలిక్‌ విచారణను ఎదుర్కొన్నాడు. 1990 నుంచి వివిధ కేసుల్లో పలు దఫాలు అరెస్టై జైలులో ఉన్నాడు. 1995లో జేకేఎల్‌ఎఫ్‌లో చీలిక రాగా ఒక వర్గానికి నేతృత్వం వహించాడు. పాకిస్థాన్‌తో పాటు విదేశాల నుంచి ఉగ్రవాదులు, వేర్పాటువాదుల మద్దతును కూడగట్టాడు. 2009లో పాకిస్థాన్‌కు చెందిన ముషాల్‌ హుసేన్‌ ములిక్‌ను వివాహమాడాడు. కుమార్తె రజియా సుల్తానా(10) తల్లితోపాటు పాకిస్థాన్‌లోనే ఉంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని