తెలుగు, ఆంగ్లం చదవలేరు

రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు తెలుగులో సరిగా చదవడం, రాయడం రావడం లేదని, ఇంగ్లిష్‌లో పదాలు, వాక్యాలను సొంతగా చదవలేకపోతున్నారని నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే-2021లో వెల్లడైంది. విద్యార్థుల అభ్యసన

Published : 26 May 2022 06:07 IST

రోజువారీ లెక్కల్లోనూ వెనకడుగే
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తక్కువ
నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే-2021 నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు తెలుగులో సరిగా చదవడం, రాయడం రావడం లేదని, ఇంగ్లిష్‌లో పదాలు, వాక్యాలను సొంతగా చదవలేకపోతున్నారని నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే-2021లో వెల్లడైంది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు జాతీయ సగటుతో పోల్చితే తక్కువగా ఉన్నాయని, గత నాలుగేళ్ల వ్యవధిలో విద్యార్థుల సామర్థ్యాల స్కోరు మరింత తగ్గినట్లు సర్వే నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో 3, 5 తరగతుల విద్యార్థులకు భాషలు, గణితం, పర్యావరణం, 8వ తరగతి విద్యార్థులకు గణితం, సోషల్‌ సైన్సెస్‌, సైన్స్‌, భాషలు, పదో తరగతి విద్యార్థులకు మోడ్రన్‌ లాంగ్వేజి, గణితం, సైన్స్‌, సోషల్‌సైన్సెస్‌, ఇంగ్లిష్‌ భాషలపై అభ్యసన సామర్థ్యాలను  మదింపు చేసింది. ఈ సర్వేలో రాష్ట్రానికి చెందిన 4,781 పాఠశాలల్లో 22,818 మంది టీచర్లు, 1,45,420 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సగటుతో పోల్చితే ఒకటి రెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి.

ప్రభుత్వ విద్యార్థుల వెనుకబాటు

భాషలు, గణితం, సైన్స్‌, సోషల్‌, ఇంగ్లిష్‌, పర్యావరణం సబ్జెక్టుల్లో 70 శాతం మంది విద్యార్థుల అవగాహన స్థాయి సాధారణం, అంతకన్నా తక్కువగా ఉంది. జాతీయస్థాయి సగటుతో పోల్చితే రాష్ట్రవిద్యార్థుల సగటు తక్కువగా నమోదైంది. సర్వేలో విద్యార్థులను అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాల్లో సగటున 45 శాతమే సరైనవిగా నమోదయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. వీరికన్నా బీసీ విద్యార్థుల

ప్రగతి కొంచెం నయం.

మూడో తరగతి: విద్యార్థులు చిన్న పదాలు, తరగతి గదుల్లోని గోడలపై పోస్టర్లపై అంశాలు, గేయాలు చెప్పలేకపోయినట్లు వెల్లడైంది. గణితంలో మూడంకెల విలువల్ని వాటి స్థానాల ఆధారంగా గుర్తించడంలో ఇబ్బంది పడ్డారు. కూడికలు, తీసివేతలు, భాగాహారాలు చేయలేకపోయారు. పక్షులు, ఆహారం, జంతువులను గుర్తించడంలో విఫలమయ్యారు.

అయిదో తరగతి: దైనందిన జీవితంలో భాగమైన సంఖ్యలను వినియోగించలేకపోయారు. త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం చుట్టుకొలత, వైశాల్యం గణించలేదు. సంఖ్యలను చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, విపత్తులపై అవగాహన కొరవడింది.

ఎనిమిదో తరగతి: తరగతి గదిలోని వస్తువులు, చతురస్ర, దీర్ఘ చతురస్ర వస్తువులు, గది నేల, చాక్‌పీస్‌ బాక్సు చుట్టుకొలత, వైశాల్యం లెక్కించలేకపోయారు. భాగాహారాలలో వెనుకబడ్డారు. దైనందిన జీవితానికి సంబంధించిన ఆకర్షణీయ సంఖ్యల సమస్యలకు సమాధానాలివ్వలేదు. పటాలపై చారిత్రక ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించలేకపోయారు. 1857 సిపాయిల తిరుగుబాటుపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని