పాక్‌లో ఎన్నికలు నిర్వహించాల్సిందే..!

పాకిస్థాన్‌లో ప్రావిన్షియల్‌ అసెంబ్లీలను రద్దుచేసి.. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పదవీచ్యుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు 6 రోజుల్లోగా ప్రకటన చేయాలని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేనట్లయితే

Published : 27 May 2022 05:56 IST

6 రోజుల్లో ప్రకటించాలి: ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ప్రావిన్షియల్‌ అసెంబ్లీలను రద్దుచేసి.. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పదవీచ్యుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు 6 రోజుల్లోగా ప్రకటన చేయాలని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేనట్లయితే ‘యావత్తు దేశం’తో కలిసి తాను మళ్లీ రాజధాని (ఇస్లామాబాద్‌)కి వస్తానని హెచ్చరించారు. ‘ఆజాదీ మార్చ్‌’ పేరిట వేలాది మంది నిరసనకారులతో ప్రదర్శనగా ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఆయన వారిని ఉద్దేశించి గురువారం ఉదయం ప్రసంగించారు. ఆయన పార్టీ పాకిస్థాన్‌-ఈ-ఇన్సాఫ్‌ (పీటీఐ) ఈ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రస్తుత పాక్‌ సర్కారును ‘దిగుమతి ప్రభుత్వం’గా ఇమ్రాన్‌ ఎద్దేవా చేశారు. శాంతియుతంగా చేపట్టిన ఈ ప్రదర్శనను అడ్డుకునేందుకు ప్రభుత్వం దాడులు, అరెస్టులు, బాష్పవాయు ప్రయోగం వంటివాటి ద్వారా ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రదర్శన సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో తన పార్టీకి చెందిన ఐదుగురు నిరసనకారులు చనిపోయిన విషయాన్ని ప్రస్తావించారు.

నియంతృత్వం చెల్లదు : షెహబాజ్‌

ఎన్నికలు ఎప్పుడు జరపాలో పార్లమెంటు నిర్ణయిస్తుందని, ఈ విషయంలో నియంతృత్వం పనిచేయదని  ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పష్టంచేశారు. 2014లో మాదిరి పరిస్థితులను సృష్టించేంద]ుకు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇమ్రాన్‌పై ప్రభుత్వం దాఖలుచేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను పాక్‌ సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.

పాక్‌లో ఈవీఎంల రద్దు!

పాకిస్థాన్‌లో ఎన్నికలకు సంబంధించి జాతీయ అసెంబ్లీ  కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంల) వినియోగాన్ని నిలిపివేయడంతో పాటు, విదేశాల్లో ఉంటున్నవారికి ఓటు హక్కును నిరోధించడం ఈ బిల్లులోని కీలకాంశాలు.  ఇమ్రాన్‌ సర్కారు అమల్లోకి తెచ్చిన ఎన్నికల సంస్కరణలను రద్దుచేసే  బిల్లుకు తాజాగా జాతీయ అసెంబ్లీ (దిగువ సభ) ఆమోదం తెలిపింది. దీనిని శుక్రవారం సెనేట్‌కు పంపించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని