300 మంది మహిళలను మోసగించిన సైబర్‌ వరుడికి సంకెళ్లు

పెళ్లి పేరుతో దాదాపు 300 మంది భారతీయ మహిళలను మోసగించి, రూ.కోట్లు కొల్లగొట్టిన నైజీరియా దేశస్థుడిని ఎట్టకేలకు నోయిడా సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 28 May 2022 12:23 IST

నోయిడా: పెళ్లి పేరుతో దాదాపు 300 మంది భారతీయ మహిళలను మోసగించి, రూ.కోట్లు కొల్లగొట్టిన నైజీరియా దేశస్థుడిని ఎట్టకేలకు నోయిడా సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. నైజీరియాలోని లాగోస్‌ ప్రాంతానికి చెందిన గరుబా గలుంజే (38) దక్షిణ దిల్లీలోని కిషన్‌గఢ్‌లో నివాసం ఉంటూ సామాజిక మాధ్యమాలు, వివాహ సంబంధ వెబ్‌సైట్ల ద్వారా యువతులతో స్నేహం చేసుకునేవాడు. తనను తాను కెనడాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడిగా పరిచయం చేసుకొని, జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నట్లు వల విసిరేవాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లాలో నివాసం ఉంటున్న ఓ యువతి ఫిర్యాదుతో నిందితుడి మోసం బయటపడింది. ‘జీవన్‌ సాథీ’ వివాహ వెబ్‌సైటులో ఈమె కూడా తన పేరు నమోదు చేసుకొంది. ఈ వెబ్‌సైటు ద్వారా ఆమెకు పరిచయమైన వ్యక్తి ఇండో - కెనడియన్‌ అయిన తన పేరు సంజయ్‌సింగ్‌ అని చెప్పినట్లు నోయిడా సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషను ఇన్‌స్పెక్టర్‌ రీటా యాదవ్‌ తెలిపారు. క్రమంగా ఆమె విశ్వాసం పొందిన ఆ వ్యక్తి పలు దఫాలుగా రూ.60 లక్షల మేర వివిధ బ్యాంకు ఖాతాలకు జమ చేయించుకున్నాడని, తాను మోసపోయినట్లు యువతి ఆలస్యంగా గ్రహించిందని మీడియాకు వెల్లడించారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందిన తర్వాత కూపీ లాగడంతో నైజీరియన్‌ గుట్టు రట్టయి అరెస్టు చేసినట్లు రీటా యాదవ్‌ వెల్లడించారు. విచారణలో ఇలా దాదాపు 300 మంది మహిళలను అతను మోసం చేసినట్లు తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని