మోకాళ్లతో తొక్కిపట్టి.. బాష్పవాయువుతో ఊపిరాడకుండా చేసి!

బ్రెజిల్‌లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించారు. మోకాళ్లతో అతణ్ని తొక్కిపట్టి హింసించారు. బాష్పవాయువు ప్రయోగించి ఊపిరాడకుండా చేశారు.

Updated : 28 May 2022 11:44 IST

బ్రెజిల్‌లో పోలీసుల కర్కశత్వానికి నల్లజాతీయుడు బలి
దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

రియో డీ జెనీరో: బ్రెజిల్‌లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించారు. మోకాళ్లతో అతణ్ని తొక్కిపట్టి హింసించారు. బాష్పవాయువు ప్రయోగించి ఊపిరాడకుండా చేశారు. బాధితుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి బలైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతంతో దీన్ని పోలుస్తున్నారు. బ్రెజిల్‌లో మృతిచెందిన వ్యక్తిని జెనివాల్డో డి శాంటోస్‌ (38)గా గుర్తించారు. సెర్గిపె రాష్ట్రంలోని యుంబౌబలో ఇద్దరు పోలీసులు మంగళవారం శాంటోస్‌ను అరెస్టు చేసి హింసించారని, తర్వాత కారు డిక్కీలో పడేసి అతడిపై బాష్పవాయువును ప్రయోగించారని స్థానికులు తెలిపారు. దయచేసి వదిలేయండంటూ శాంటోస్‌ ప్రాధేయపడుతున్నా వారు పట్టించుకోలేదని చెప్పారు. పోలీసుస్టేషన్‌కు తరలిస్తుండగా అతడు తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడని పేర్కొన్నారు. ఊపిరాడకపోవడం వల్లే బాధితుడు మరణించాడని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ ఘటనపై బ్రెజిల్‌లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. పోలీసులే శాంటోస్‌ను హత్య చేశారంటూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దురుసుగా ప్రవర్తించడంతో శాంటోస్‌ను పోలీసులు అరెస్టు చేశారని, అతణ్ని నియంత్రించాలన్న ఉద్దేశంతోనే బాష్పవాయువును ప్రయోగించారని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని