2100 నాటికి.. సగం తగ్గనున్న చైనా జనాభా

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాలో పరిస్థితులు మారిపోతున్నాయి. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆ దేశ జనాభా తగ్గుముఖం పడుతోంది. 2021లో చైనా జనాభా 4.80 లక్షలు మాత్రమే పెరిగింది.

Published : 31 May 2022 06:26 IST

ఆర్థిక భవిష్యత్తు అగమ్యగోచరం!

మెల్‌బోర్న్‌: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాలో పరిస్థితులు మారిపోతున్నాయి. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆ దేశ జనాభా తగ్గుముఖం పడుతోంది. 2021లో చైనా జనాభా 4.80 లక్షలు మాత్రమే పెరిగింది. కార్మిక శక్తి తగ్గుతున్న వేళ డ్రాగన్‌ ఏక సంతాన విధానాన్ని రద్దు చేసి, పిల్లలను కనే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించినా.. చైనీయులు మాత్రం పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు. 2021 నుంచి ఏటా సగటున 1.1 శాతం చొప్పున తగ్గుతున్న చైనా జనాభా 2100 సంవత్సరం నాటికి కేవలం 58.7 కోట్లకు పడిపోతుందని షాంఘై అకాడమీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ అంచనా వేసింది. అంటే ఇప్పుడున్న జనాభాలో సగంకంటే తక్కువన్నమాట. గడచిన నాలుగు దశాబ్దాలలోనే చైనా జనాభా 66 కోట్ల నుంచి 140 కోట్లకు పెరిగింది. కానీ, ఈ ఏడాది మొదటిసారి జనాభా వృద్ధి రేటు మందగించింది. 2020లో 141 కోట్ల 21 లక్షల 20 వేలుగా ఉన్న చైనా జనాభా 2021లో కేవలం 4.80 లక్షలు మాత్రమే పెరిగి 141 కోట్ల 26 లక్షలైందని చైనా జాతీయ గణాంక సంస్థ వెల్లడించింది. చైనా 2016లోనే ఏక సంతాన విధానానికి స్వస్తి చెప్పి, గత ఏడాది పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలతో ముగ్గురు బిడ్డలు ముద్దు విధానాన్ని ముందుకు తెచ్చింది. అయినా చైనా జనాబా వృద్ధి రేటు పడిపోతోందే తప్ప పెరగడం లేదు. దీనికి పలు కారణాలున్నాయి. జీవన వ్యయం పెరిగి పిల్లలను పెంచడం కష్టమైపోవడం వాటిలో ఒకటి. చిన్న కుటుంబాలకు అలవాటుపడిన చైనీయులు ఉన్నట్టుండి పెద్ద కుటుంబాలకు మారడానికి ఇష్టపడటం లేదు. చైనాలో గర్భధారణ వయసులోని వనితల సంఖ్యా పడిపోతోంది. స్త్రీలు పెళ్లిని వాయిదా వేస్తున్నందున పిల్లలను కనే వయసు దాటిపోతోంది. కరోనా వల్ల జననాలను వాయిదా వేసుకోవడం ఎక్కువైంది. పలు కారణాలతో జనాభా తరగిపోవడం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నది.

ఆందోళనకరంగా స్త్రీల కొరత

దేశ జనాభాలో మరణాలను జననాలతో భర్తీ చేయాలంటే ప్రతి స్త్రీ సగటున 2.1 మంది పిల్లలను కనాలి. చైనాలో 1980లలో 2.6 శాతంగా ఉన్న ఈ రేటు క్రమంగా తగ్గిపోతూ 2021లో కేవలం 1.15కి చేరింది. ఇది మున్ముందు 1.1కి పడిపోతుందని అంచనా. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియాలలో ఈ రేటు 1.6 శాతంగా ఉంటే, జపాన్‌లోనూ ఇది 1.3 శాతంగా ఉంది. ఏక సంతాన విధానం వల్ల చైనీయులు మగ బిడ్డను కోరుకోవడం వల్ల పునరుత్పత్తికి తగిన సంఖ్యలో స్త్రీలు లేకుండా పోయారు. చాలా దేశాల్లో ప్రతి 100 మంది బాలికలకు 106 మంది బాలురు జన్మిస్తుంటే.. చైనాలో 120మంది బాలురు జన్మిస్తున్నారు.  చైనాలో 2014లో గరిష్ఠ స్థాయికి చేరిన పని చేసే వయసులోని జనాభా.. 2100నాటికి అందులో మూడో వంతుకు పడిపోనున్నది. 2080కల్లా చైనాలో పని చేసే వయసువారికన్నా వృద్ధుల (65 ఏళ్లకుపైన) జనాభా పెరిగిపోతుంది. ప్రస్తుతం 20 మంది వృద్ధులకు 100 మంది పని చేసే వయసువారుంటే, 2100 నాటికి అదే 100మంది 120 మంది వృద్ధులకు ఆసరా ఇవ్వాల్సి వస్తుంది.


పని చేసే వారి సంఖ్యా పడిపోతోంది

చైనాలో పని చేసే వయసులోని వారి సంఖ్య ఏటా 1.73 శాతం చొప్పున పడిపోతోంది. వీరి సంఖ్య తగ్గడంవల్ల ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి వస్తుంది. దాంతో చైనా నుంచి పరిశ్రమలు కార్మిక వ్యయం తక్కువగా ఉండే వియత్నాం, భారత్‌, బంగ్లాదేశ్‌ల వంటి దేశాలకు తరలిపోయే అవకాశం ఉంది. కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే పరిశ్రమలు ఇతర దేశాలకు తరలిపోతున్నప్పుడు చైనా తక్కువ మంది మానవ సిబ్బందితోనే ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఉత్పాదకతను పెంచుకోకపోతే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువై చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని