Agnipath: అగ్నివీరులకు హరియాణాలో ప్రభుత్వోద్యోగాలు

అగ్నిపథ్‌ పథకం కింద నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసి, బయటకు వచ్చిన అగ్నివీరులకు హరియాణా ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు ఇస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రకటించారు. హరియాణా ప్రభుత్వ సేవల్లో చేరాలనుకున్న అగ్నివీరులందరినీ

Updated : 22 Jun 2022 07:54 IST

 వారిని గ్రూపు-సి పోస్టుల్లో తీసుకుంటాం: ఖట్టర్‌  

ఆందోళనకారుల నుంచే పరిహారం రాబట్టనున్న వారణాసి యంత్రాంగం

దిల్లీ, చండీగఢ్‌, ఈనాడు-లఖ్‌నవూ: అగ్నిపథ్‌ పథకం కింద నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసి, బయటకు వచ్చిన అగ్నివీరులకు హరియాణా ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు ఇస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రకటించారు. హరియాణా ప్రభుత్వ సేవల్లో చేరాలనుకున్న అగ్నివీరులందరినీ గ్రూపు-సి కింద గుమస్తాలు, ఉపాధ్యాయులు, ఆఫీస్‌ అసిస్టెంట్లు వంటి నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులుగా, పోలీసు సిబ్బందిగా తీసుకుంటామని చెప్పారు. ఎవరినీ విస్మరించేది లేదని స్పష్టంచేశారు. ఈ విషయంలో దేశంలో తొలి రాష్ట్రంగా హరియాణా నిలుస్తుందన్నారు. మంగళవారం ఒక కార్యక్రమంలో ఆయన ఈ మేరకు స్పందించారు. మాజీ సైనికుల్ని నియమించడానికి 50% మించిన రిజర్వేషన్‌ను ఎలా వర్తింపజేస్తారని విపక్ష కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఆ అంశాన్ని ఎవరైనా కోర్టులో సవాల్‌ చేసే అవకాశం ఉందనీ, యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దని ఆ పార్టీ సీనియర్‌ నేత రణ్‌దీప్‌సింగ్‌ సుర్జేవాలా హితవు పలికారు.


మాజీ సైనికుల్ని ఉద్యోగాల్లో తీసుకుని చేతల్లో చూపండి: అఖిలేశ్‌

అగ్నివీరులకు ఉద్యోగాలిస్తామని పారిశ్రామికవేత్తలు చేస్తున్న ప్రకటనలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ స్పందిస్తూ- ముందుగా మాజీ సైనికుల్ని ఆ ఉద్యోగాల్లోకి తీసుకుని యువతలో విశ్వాసం నింపాలని సూచించారు. ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్నవారి జాబితాను ఈ పథకం మద్దతుదారులకు పంపిస్తామని చెప్పారు. అగ్నిపథ్‌కి నిరసనగా హింసాత్మక ఘటనలకు పాల్పడినవారి నుంచే దానికి తగ్గ పరిహారాన్ని వసూలు చేయడానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రయత్నం మొదలైంది. అల్లర్లకు కారకుల్ని గుర్తించే పనిని వారణాసి యంత్రాంగం మొదలుపెట్టింది. నష్టపోయిన మొత్తాన్ని దానికి కారకుల నుంచి రాబడతామని జిల్లా కలెక్టర్‌ స్పష్టంచేశారు. ఆందోళనకారుల పేర్లను క్లెయిం అథారిటీకి పంపే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. గాజీపుర్‌, అజంగఢ్‌, వారణాసి తదితర జిల్లాల్లో నిందితులను అరెస్టు చేశారు. అలీగఢ్‌ జిల్లాలో పోలీసులు బుల్డోజర్లతో కవాతు నిర్వహించారు.


కాంగ్రెస్‌ది రాజకీయ దురుద్దేశం: వి.కె.సింగ్‌

కొచ్చి: అగ్నిపథ్‌ విషయంలో రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి, విశ్రాంత సైన్యాధిపతి వి.కె.సింగ్‌ ఆరోపించారు. కావాలనే యువతను ఆ పార్టీ పక్కదోవ పట్టిస్తోందని విమర్శించారు. సైన్యంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఏ సంస్కరణలు ప్రతిపాదించినా కొందరు అడ్డుపడుతూనే ఉన్నారని నిందించారు. యువ జవాన్లను సైన్యంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని