Updated : 24 Jun 2022 09:05 IST

ఏక్‌నాథ్‌ వ్యూహమేంటో!

తిరుగుబాటు నేత చేతిలో శివసేన సర్కారు భవితవ్యం

ముంబయి: మహారాష్ట్రలో ఉత్కంఠ కలిగిస్తున్న రాజకీయ సంక్షోభానికి ముగింపు శివసేన తిరుగుబాటు నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ శిందే చేతుల్లో ఉంది. ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారు నిలబడాలన్నా.. భాజపా ప్రభుత్వం ఏర్పడాలన్నా.. లేదా అసెంబ్లీ రద్దు కావాలన్నా.. శిందే నిర్ణయమే కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ముందున్న అవకాశాలను ఓసారి పరిశీలిస్తే..

తొలుత తన వెంట ఉన్న ఎమ్మెల్యేలకు శిందే గుర్తింపు తెచ్చుకోవాలి. ఇందుకోసం గవర్నర్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. గవర్నర్‌ ఈ ఎమ్మెల్యేలను గుర్తిస్తే ఫిరాయింపు చట్టం నుంచి వీరికి రక్షణ లభిస్తుంది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు కూడగట్టగలిగితే.. తమనే శివసేన శాసనసభా పక్షంగా గుర్తించాలని గవర్నర్‌ను కోరవచ్చు. ఇందుకోసం ఆయనకు 37 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తాజా పరిణామాలను బట్టి ఆ సంఖ్య కన్నా ఎక్కువ మందే ఆయన వెంట ఉన్నట్లు తెలుస్తోంది.

* తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలందరితో కలిసి భాజపాలో చేరే అవకాశం శిందేకు ఉంది. అయితే, శివసేనకు నిజమైన మద్దతుదారుడిగా, బాల్‌ ఠాక్రేకు విశ్వాసపాత్రుడైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. భాజపాలో చేరితే ఆ గుర్తింపు పోతుంది. ఠాణె ప్రాంతంపై శిందేకు గట్టి పట్టు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పనిచేసే శివసేన కార్యకర్తలు భాజపాలో చేరుతారా? అంటే కష్టమే! ఇటీవల ఆయన చేసిన ప్రకటనల్లో భాజపాలో చేరుతున్నట్టు ఎక్కడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో శిందే ఆ రిస్క్‌ చేస్తారా అనేది ప్రశ్నార్థకం.

ఠాక్రే ముందున్న అవకాశాలు...

సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తన పార్టీపై పట్టుకోల్పోయారు ఉద్ధవ్‌ ఠాక్రే! బుధవారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో భావోద్వేగ ప్రసంగం చేసిన ఆయన.. వెంటనే సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. తద్వారా తన ఓటమిని ఒప్పుకున్నారు! అయితే, ఆయన ఇంకా రాజీనామా చేయలేదు. పరిస్థితులన్నీ ఆయన చేయి దాటిపోయాయని ఇప్పుడే చెప్పలేం. సభలో బలం నిరూపించుకొనే అవకాశం ఆయన ముందు ఉంది. ఇది జరగాలంటే, ముందుగా రెబల్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించి.. తనవైపు తిప్పుకోవాలి.

భాజపా ఏం చేయగలదంటే?

ప్రస్తుత పరిణామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి, భాజపా నేత రావ్‌సాహెబ్‌ ధన్వే పాటిల్‌ చెబుతున్నారు. అయితే, విపక్షనేత దేవేంద్ర ఫడణవీస్‌తో భాజపా నేతలు చర్చలు జరుపుతున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం కూలిపోతే కలిసొచ్చేది భాజపాకే. అయితే, ముందు ఎంవీఏ  సర్కారు మైనారిటీలో పడిందని గవర్నర్‌ గుర్తించాలి. అది జరగాలంటే శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు ప్రత్యేక కూటమిగానో, శివసేన సభాపక్షంగానో గుర్తింపు పొందాలి. అనంతరం, వీరి మద్దతును భాజపా కూడగట్టుకోవాలి. సభలో అతిపెద్ద పార్టీ భాజపానే కాబట్టి గవర్నర్‌.. వారినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది. గవర్నర్‌ ఆహ్వానాన్ని వీరు అంగీకరించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. రెండున్నరేళ్లు అధికారంలో కొనసాగుతారు. భాజపా ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే ఎన్నికలు అనివార్యం అవుతాయి.

ఎన్సీపీ-కాంగ్రెస్‌...

చివరి వరకు ఠాక్రేతో ఉంటామని ఎన్సీపీ చెబుతోంది. ప్రభుత్వం కూలిపోతే విపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వం పతనమైతే కాంగ్రెస్‌కు సైతం ఇదే పరిస్థితి ఎదురవుతుంది.


గవర్నర్‌ పాత్ర కీలకం..

రాష్ట్రంలో ఇప్పుడు గవర్నర్‌ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఎమ్మెల్యేలను గుర్తించాలని శిందే లేఖ రాస్తే.. సంఖ్యా బలంపై గవర్నర్‌ నిర్ధరణకు రావాలి. శిందే అభ్యర్థనను ఠాక్రే సవాల్‌ చేస్తే.. అత్యవసరంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి..సభా విశ్వాసం పొందాలని ఆదేశించాలి. ఠాక్రే ప్రభుత్వం కూలిపోతే భాజపాను ఆహ్వానించే
అధికారం గవర్నర్‌కు ఉంటుంది.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని