Published : 24 Jun 2022 06:03 IST

ఇంకా కొరతే

 రాష్ట్రంలో మెరుగుపడని పెట్రోలు, డీజిల్‌ సరఫరా

హైదరాబాద్‌లో మెరుగు, గ్రామీణంలో ‘నో స్టాక్‌’ బోర్డులు

ఇబ్బంది పడుతున్న వాహనదారులు 

వ్యవసాయ పనులకు అడ్డంకులు

పెట్రోలు, డీజిల్‌ కొరత రాష్ట్ర ప్రజలను వెంటాడుతోంది. హైదరాబాద్‌ నగర శివార్లు సహా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పలు బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు ట్రాక్టర్లు వినియోగించే రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

పెట్రోలు, డీజిల్‌ కలిపి తెలంగాణలో రోజుకు సుమారు రెండు కోట్ల లీటర్లు అవసరం. డీజిల్‌ సుమారుగా 1.40 లక్షల లీటర్లు, పెట్రోలు 60 లక్షల లీటర్ల వరకు వినియోగం అవుతుందని అంచనా. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్లకు సంబధించిన సుమారు 3,520 బంకులు రాష్ట్రంలో ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 807 ఉన్నాయి. ఇవి కాకుండా ప్రయివేటు రంగంలో మరో నాలుగు నుంచి అయిదు వందల వరకు ఉన్నాయి. సాధారణంగా హైదరాబాద్‌లో పెట్రోలు, గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. రాజధాని నగరంలో సరఫరా బాగున్నా, శివార్లు, జిల్లాల్లో కొరత వినియోగదారులను వేధిస్తోంది.

సమీక్షించినా కొలిక్కిరాని సమస్య

పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చమురు సంస్థల ప్రతినిధులతో ఇటీవల సమీక్షించారు. కొరత లేకుండా చూడాలని స్పష్టంచేశారు. అయినా సరఫరా మెరుగుపడలేదని సమాచారం. మరోవైపు బల్క్‌ కొనుగోలుదారులకు పెట్రోలు, డీజిల్‌ విక్రయించవద్దంటూ చమురు సంస్థలు పెట్రోలు బంకు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కొన్ని సందర్భాల్లో సరఫరాను కూడా చమురు సంస్థలు నియంత్రిస్తున్నాయనే ప్రచారం ఉంది. బల్క్‌గా సరఫరా చేసే పెట్రోలు, డీజిల్‌ ధరలను చమురు సంస్థలు పెంచటంతో అధిక శాతం ఆ రకం వినియోగదారులు బంకుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఉదాహరణకు తెలంగాణ ఆర్టీసీ రోజుకు ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తోంది. గడిచిన రెండున్నర నెలలుగా ఆర్టీసీ కూడా బంకుల్లోనే కొనుగోలు చేస్తోంది. ఆర్టీసీకి విక్రయించవద్దంటూ కొన్ని చమురు సంస్థలు డీలర్లను ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. అలాంటి బంకులను నియంత్రించే క్రమంలో చమురు సంస్థలు సరఫరాను తగ్గిస్తున్నట్టు తెలిసిందని, ఇది కూడా కొరతకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

సేద్యానికి ఇబ్బందులే

రుతు పవనాలు రాష్ట్రాన్ని తాకటంతో వ్యవసాయ పనులు ఇప్పుడిప్పుడే ముమ్మరమవుతున్నాయి. ట్రాక్టర్ల వినియోగం పెరుగుతోంది. ఈ సమయంలో డీజిల్‌ కొరత కొనసాగితే దుక్కులు దున్నడం ఆలస్యమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘రాష్ట్రంలో నీటి లభ్యత పెరగటంతో సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ట్రాక్టర్లు, పురుగు మందుల పిచికారీ పరికరాలు, కోతల యంత్రాలూ పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ట్రాక్టర్లే సుమారు 6.50 లక్షల వరకూ ఉన్నాయి. మున్ముందు వ్యవసాయ పనులు ఊపందుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్‌ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోదఫా జోక్యం చేసుకుని సరఫరా సాఫీగా సాగేలా చమురు సంస్థలపై ఒత్తిడి తేవాలని’ వ్యవసాయాధికారులు కోరుతున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని