Published : 24 Jun 2022 06:03 IST

కాలుష్యం లెక్కలు పక్కాగా తేలతాయ్‌!

 వాహనాల తనిఖీ... వివరాలు డేటాబేస్‌లో నమోదు

ముంబయి తరహా విధానం అమలుకు ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని రోడ్లపై గంటసేపు తిరిగితే పది సిగరెట్లు తాగినట్లే... మితిమీరి పెరుగుతున్న వాయు కాలుష్యమే ఇందుకు కారణం. ముఖ్యంగా వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో దానికి అనుబంధంగా కాలుష్యం కూడా పెరుగుతోంది. గ్రీన్‌పీస్‌ సంస్థ అంచనా ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా వాయు కాలుష్యం నమోదవుతున్న నగరాల్లో బెంగళూరు తర్వాతి స్థానం హైదరాబాద్‌దే. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ఇప్పుడు పోలీసుశాఖ రంగంలోకి దిగుతోంది. ముంబయి పోలీసుల తరహాలో చర్యలు చేపడుతోంది. వాహనాల కాలుష్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు దాన్ని తమ డేటాబేస్‌లో ఎప్పటికప్పుడు నిల్వచేయబోతోంది. తద్వారా రోడ్డుమీద వాహనాల తనిఖీ జరిపినప్పుడు దాని ద్వారా వెలువడుతున్న కాలుష్యాన్ని కూడా పరిశీలించాలని, ఉల్లంఘనలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

పెరుగుతున్న వాహనాల వల్ల తలెత్తుతున్న ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డు ప్రమాదాల సంగతి పక్కనపెడితే వీటివల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.45 కోట్ల వాహనాలు ఉండగా వాటిలో 1.06 కోట్లు ద్విచక్రవాహనాలే. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 70 లక్షల వాహనాలు ఉన్నాయి. మహానగరంలో రోజుకు వెయ్యి ద్విచక్రవాహనాలు.. 500 కార్లు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. దీంతో కాలుష్యం కూడా అనూహ్యంగా పెరుగుతోంది. దీన్ని నివారించేందుకు ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేసి ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉన్నా దీనికి వ్యవస్థీకృత విధానం అంటూ ఏమీ లేదు. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో పనిచేస్తున్న యంత్రాల ద్వారా విచ్చలవిడిగా ధ్రువపత్రాలు మంజూరవుతున్నాయి. చాలాకాలంగా ఈ తతంగం నడుస్తున్నా చక్కదిద్దేందుకు మాత్రం ఎవరూ ప్రయత్నించడంలేదు. కానీ మొదటిసారిగా ఇప్పుడు వాహనాల కాలుష్యాన్ని తనిఖీ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పెట్రోల్‌ బంకుల్లో అత్యాధునిక కాలుష్య తనిఖీ యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా పెట్రోలియం సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడ ఎవరికివారు తమ వాహనాన్ని తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలను అక్కడిక్కడే పోలీసుశాఖ డేటాబేస్‌లో నమోదు చేస్తారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు వాహనం నంబరు తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో ఎంటర్‌ చేయగానే అది వెదజల్లే కాలుష్యం స్థాయి కూడా తెలుస్తుంది. అనుమానం ఉంటే పోలీసులు వాహనం కాలుష్యాన్ని అక్కడిక్కడే పరిశీలించి దాన్ని తమ వద్ద ఉన్న డేటాబేస్‌తో సరిపోల్చుతారు. కాలుష్యం ఎక్కువగా ఉంటే చలానా విధిస్తారు. మంబయిలో అమలు చేస్తున్న ఈ విధానం సత్ఫలితాన్ని ఇచ్చిందని, దీన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో అమలు చేయాలనుకుంటున్నామని, ప్రయోగాత్మకంగా తొలుత హైదరాబాద్‌లో మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని