ఈటీవీ భారత్‌ చొరవతో చిన్నారిని ఆదుకున్న ఫేస్‌బుక్‌ మిత్రబృందం

చిలిపి వ్యాఖ్యలు.. విమర్శలు.. ట్రోలింగులు.. ఫేస్‌బుక్‌లో గ్రూపులంటేనే ముందుగా ఇవి గుర్తుకొస్తాయి. అయితే సేవకు కూడా వెనుకాడబోమని నిరూపిస్తూ ఓ ఫేస్‌బుక్‌ బృందం ముందుకొచ్చింది.

Published : 24 Jun 2022 06:03 IST

కార్వార, న్యూస్‌టుడే : చిలిపి వ్యాఖ్యలు.. విమర్శలు.. ట్రోలింగులు.. ఫేస్‌బుక్‌లో గ్రూపులంటేనే ముందుగా ఇవి గుర్తుకొస్తాయి. అయితే సేవకు కూడా వెనుకాడబోమని నిరూపిస్తూ ఓ ఫేస్‌బుక్‌ బృందం ముందుకొచ్చింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంబర్దా గ్రామానికి చెందిన శైలేష్‌ కృష్ణ (8) మెదడు వాపు జ్వరంతో బాధపడుతున్నాడు. అపస్మారక స్ధితికి చేరుకున్న ఆ చిన్నారిని బతికించుకోవాలని తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. ధార్వాడ, తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చూపించారు. ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ‘ఈటీవీ భారత్‌’ విస్తృతంగా ప్రసారం చేసింది. దీన్ని చూసిన స్థానిక ‘ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌ గ్రూపు’ ఆ చిన్నారికి అండగా నిలిచింది. బెళగావిలోని యశ్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందజేస్తోంది. శైలేష్‌కు నయమయ్యే వరకూ వైద్య ఖర్చులను తామే భరిస్తామని వారు భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ విషయం జిల్లా పాలనాధికారి నితేష్‌ పాటిల్‌ దృష్టికి వెళ్లింది. చిన్నారికి చికిత్స కోసం తమ వంతు సాయం అందిస్తామని ఆయన కూడా హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని