శరద్‌ పవార్‌ను బెదిరిస్తారా?

మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నారాయణ రాణేపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘శరద్‌ పవార్‌ మహారాష్ట్ర బిడ్డ. మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు

Updated : 25 Jun 2022 06:11 IST

కేంద్ర మంత్రిపై సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నారాయణ రాణేపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘శరద్‌ పవార్‌ మహారాష్ట్ర బిడ్డ. మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ఆయన్ను ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటామని కేంద్ర మంత్రి బెదిరించారు. రోడ్డు మీద నిలువరిస్తామని భయపెట్టే ప్రయత్నం చేశారు. మోదీజీ, అమిత్‌ షా జీ ఆ బెదిరింపులకు మీరు మద్దతు ఇస్తున్నారా?ఇదే భాజపా నైజం అయితే అదే విషయాన్ని మీరే ప్రకటించండి. ప్రభుత్వం ఉండొచ్చు లేక పడిపోవచ్చు.. కానీ పవార్‌తో వ్యవహరించిన తీరు మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అంటూ సంజయ్‌ రౌత్‌ ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన సంకీర్ణ ప్రభుత్వం గత నాలుగు రోజులుగా అభివృద్ధి పనులకు సంబంధించి రూ.వేల కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఈ నెల 20 నుంచి 23 వరకు 182 జీవోలు విడుదలయ్యాయి. వీటిని అడ్డుకోవాల్సిందిగా విపక్ష భాజపా గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని భాజపా అనుకూల స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇద్దరు డిమాండ్‌ చేశారు. ఏక్‌నాథ్‌ శిందే స్థానంలో ఠాక్రే వర్గ ఎమ్మెల్యే అజయ్‌ చౌదరిని శివసేన శాసనసభా పక్ష నేతగా గుర్తించినట్లు నరహరి ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు.


తాత్కాలిక సీఎంగా నియమించండి
గవర్నర్‌కు ఓ సామాన్యుడి లేఖ

సర్కారును కాపాడుకునే పనిలో నిమగ్నమైన సీఎం ఠాక్రే రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆయన స్థానంలో తనను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించాలని కోరుతూ బీడ్‌ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ గడాలే అని వ్యక్తి గవర్నర్‌కు లేఖ రాశారు. నిరుద్యోగులు,రైతులు కూలీల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.


శివసేన అంతమే భాజపా లక్ష్యం: ఉద్ధవ్‌

ముంబయి: శివసేన కార్యకర్తలే తన సంపద అని ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. వారు తన వెంట ఉన్నంత వరకూ ఇతరుల విమర్శలనూ లెక్కచేయబోనని అన్నారు. సొంత పార్టీ వారే తనకు వెన్నుపోటు పొడిచారని అసమ్మతి ఎమ్మెల్యేలపై ధ్వజమెత్తారు. విధేయులైన కార్యకర్తలు ఎందరినో పక్కన పెట్టి ఎన్నికల్లో వాళ్లకు టికెట్లు ఇచ్చామన్నారు. మీ కష్టంపై ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీకి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి ఆయన పార్టీకి చెందిన కార్పొరేటర్లను ఉద్దేశించి వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు.  శివసేన కార్యకర్తలను పార్టీ నుంచి దూరం చేయగల సత్తా తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే, భాజపాలకు ఉందా అని ఆవేశంగా ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని