ఎట్టకేలకు ఆమోదం పొందనున్న తుపాకుల కట్టడి బిల్లు

ఎప్పుడెప్పుడా అని అమెరికన్లు ఎదురుచూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లు ఎట్టకేలకు కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఆమోదం పొందనున్నది. నవంబరులో అమెరికా కాంగ్రెస్‌ మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నందున... పాలక డెమోక్రాట్లతోపాటు

Published : 25 Jun 2022 05:51 IST

మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో  మద్దతు తెలిపిన రిపబ్లికన్‌ సెనేటర్లు
దిగువసభ ఆమోదించడం లాంఛనప్రాయమే...

వాషింగ్టన్‌: ఎప్పుడెప్పుడా అని అమెరికన్లు ఎదురుచూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లు ఎట్టకేలకు కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఆమోదం పొందనున్నది. నవంబరులో అమెరికా కాంగ్రెస్‌ మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నందున... పాలక డెమోక్రాట్లతోపాటు ప్రతిపక్ష రిపబ్లికన్లూ బిల్లుకు ఆమోదం తెలపాల్సిన అగత్యం తోసుకొచ్చింది. ప్రస్తుతం డెమోక్రాట్లకు కాంగ్రెస్‌ దిగువసభ అయిన ప్రజాప్రతినిధుల సభలో కొంత మెజారిటీ ఉన్నా, 100 సీట్ల ఎగువసభ సెనెట్‌లో సగం సీట్లే ఉన్నాయి. అందువల్ల సెనెట్‌లో ప్రతిపక్ష రిపబ్లికన్ల మద్దతు తప్పనిసరి అయింది. గురువారం 15 మంది రిపబ్లికన్లు బిల్లుకు సమ్మతించడంతో సెనెట్‌లో తుపాకుల నియంత్రణ బిల్లు 65-33 ఓట్ల తేడాతో నెగ్గింది. దిగువసభ ప్రజాప్రతినిధుల సభలో పాలక డెమోక్రాట్లకు స్వల్పాధిక్యత ఉంది కాబట్టి అక్కడ బిల్లును నెగ్గించుకోగలుగుతుంది. తుపాకీ ప్రియులైన రిపబ్లికన్‌ ఓటర్లను, తుపాకుల పరిశ్రమను సంతోషపెట్టడానికి దిగువసభలో కొందరు రిపబ్లికన్లు బిల్లును వ్యతిరేకించినా, శుక్రవారం అది పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయమేనని భావిస్తున్నారు. బిల్లుకు సెనెట్‌లో అనుకూలంగా ఓటువేసిన 15 మంది రిపబ్లికన్లలో ఇద్దరు మాత్రమే నవంబరు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల ముందుకెళ్లనున్నారు. ఎనిమిది మంది 2026లో ఎన్నికలకు వెళతారు. నలుగురు రిటైరవుతున్నారు. అందుకే వీరంతా తుపాకుల బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలనుకొంటున్న టెడ్‌ క్రూజ్‌, జాష్‌ హాలీ, టిమ్‌ స్కాట్‌ వంటి రిపబ్లికన్‌ సెనెటర్లు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అమెరికన్‌ పౌరులకు తుపాకులు ధరించే హక్కును 2వ రాజ్యాంగ సవరణ ఇచ్చిందనీ, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడతామనేది రిపబ్లికన్‌ పార్టీ అధికార విధానం. నవంబరు మధ్యంతర ఎన్నికల కోసం సెనెట్‌లో కాస్త పట్టు సడలించడం వల్ల గురువారం బిల్లు నెగ్గింది. ఇటీవల న్యూయార్క్‌, టెక్సాస్‌లలో విచ్చలవిడిగా చోటుచేసుకున్న కాల్పులకు అమాయకులు బలైన సంగతి తెలిసిందే.

బిల్లులో ఏముందంటే...

న్యూయార్క్‌, టెక్సాస్‌లలో కాల్పులు జరిపింది 18 ఏళ్ల వయసువారే. దీంతో ఇకపై 18 నుంచి 20 ఏళ్ల వయసులో తుపాకులు కొనదలిచేవారికి నేర రికార్డులు ఉన్నాయా అని ఫెడరల్‌, స్థానిక అధికారులు తనిఖీ చేసే గడువును బిల్లు పెంచింది. ఇంతవరకు తనిఖీ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి కావలసి ఉండగా, దాన్ని పది రోజులకు పెంచారు.

గృహ హింసకు పాల్పడినట్టు చరిత్ర ఉన్నవారు... ప్రస్తుతం భార్య లేదా ప్రియురాలితో కలసి ఉంటున్నా, లేకపోయినా తుపాకులు కొనడానికి మాత్రం అర్హులు కారు.

ప్రమాదకర వ్యక్తుల నుంచి తాత్కాలికంగా తుపాకులను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు కోర్టు ఉత్తర్వులు పొందే హక్కును కల్పిస్తూ... ఇప్పటివరకూ 19 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్స్‌ ఆఫ్‌ కొలంబియా చట్టాలు చేశాయి. ఈ ప్రక్రియకు ఫెడరల్‌ ప్రభుత్వం నిధులు సమకూర్చడానికి బిల్లు వీలు కల్పిస్తుంది.

తుపాకుల అక్రమ రవాణాదారులకు, ఇతరుల కోసం తుపాకులు కొనేవారికి 25 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. కాగా- తుపాకుల నియంత్రణ బిల్లుకు కాంగ్రెస్‌ ఆమోదం తెలిపి, తనకు పంపించిన వెంటనే ఆమోదముద్ర వేస్తానని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని