సీవీరోదొనెట్స్క్‌ను వీడనున్న ఉక్రెయిన్‌ సైనికులు

తూర్పు ఉక్రెయిన్‌లోని సీవీరోదొనెట్స్క్‌లో కొన్ని వారాలుగా రష్యా బలగాలపై వీరోచితంగా పోరాడుతున్న జెలెన్‌స్కీ సేనలు ఇక ఆ నగరాన్ని వీడనున్నాయి. రష్యా సైన్యం సీవీరోదొనెట్స్క్‌ను ఇప్పటికే దాదాపు పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది.

Published : 25 Jun 2022 05:51 IST

వాషింగ్టన్‌: తూర్పు ఉక్రెయిన్‌లోని సీవీరోదొనెట్స్క్‌లో కొన్ని వారాలుగా రష్యా బలగాలపై వీరోచితంగా పోరాడుతున్న జెలెన్‌స్కీ సేనలు ఇక ఆ నగరాన్ని వీడనున్నాయి. రష్యా సైన్యం సీవీరోదొనెట్స్క్‌ను ఇప్పటికే దాదాపు పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. బాంబుల మోతతో అక్కడ 80% భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ సైనికులు ఓ భారీ రసాయన కర్మాగారంలో తలదాచుకొని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇకపై పుతిన్‌ సైన్యం వారిని చుట్టుముట్టి మరింత విధ్వంసాన్ని సృష్టించే ముప్పు ఎక్కువగా ఉండటంతో సీవీరోదొనెట్స్క్‌ నుంచి బయటకు వచ్చేయాలని తమ సైనికులను ఆదేశించినట్లు లుహాన్స్క్‌ ప్రాంత గవర్నర్‌ సెర్హియ్‌ హైదై శుక్రవారం తెలిపారు.

ఈయూ సభ్యత్వ దరఖాస్తుకు ఆమోదంపై హర్షం

ఐరోపా కూటమి (ఈయూ)లో సభ్యత్వం కోసం తమ దేశం చేసుకున్న దరఖాస్తుకు గురువారం ఆమోదముద్ర పడటంపై ఉక్రెయిన్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈయూ తమ దరఖాస్తును ఆమోదించడంతో.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటం సరైనదేనని నిరూపితమైనట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పేర్కొన్నారు.  జర్మనీలోని బవేరియన్‌ ఆల్ప్స్‌లో ఆదివారం నుంచి మంగళవారం వరకు జి-7 దేశాల సదస్సు జరగనుంది. అనంతరం స్పెయిన్‌ రాజధాని మ్యాడ్రిడ్‌లో బుధ, గురువారాల్లో నాటో వార్షిక సదస్సును నిర్వహించనున్నారు. ఈ రెండింటిలోనూ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

రష్యాలో విమానం కూలి.. నలుగురి మృతి

నైరుతి రష్యాలోని ర్యాజన్‌ ప్రాంతంలో మిలిటరీ రవాణా విమానమొకటి శుక్రవారం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు విమాన సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని