మైదానాల కొరతకు ప్రత్యామ్నాయాల అన్వేషణ

రాష్ట్రంలో పోలీస్‌ నియామక ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే విషయంలో గతంలో పెద్దఎత్తున

Published : 25 Jun 2022 05:51 IST

గతానుభవాలతో పోలీస్‌ శిక్షణపై ‘మండలి’ దృష్టి
అదనంగా 4 వేల మందికి ఏర్పాట్లపై కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పోలీస్‌ నియామక ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే విషయంలో గతంలో పెద్దఎత్తున ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈసారి ముందుగానే ఈ అంశంపై దృష్టి సారించారు. 2018 నోటిఫికేషన్‌లో దాదాపు 15వేల మంది ఎంపిక కాగా వీరిలో మూడు వేల మందికి సరిపడా మైదానాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ క్రమంలో దాదాపు 4వేల మందితో కూడిన టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లకు శిక్షణను వాయిదా వేశారు. శాంతిభద్రతలతోపాటు ఇతర విభాగాల అభ్యర్థులతోపాటే వీరికీ శిక్షణ ప్రారంభించాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చివరిదాక ప్రయత్నించింది. ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల హోంశాఖలనూ సంప్రదించింది. అయితే అక్కడా మైదానాలు సరిపడా లేకపోవడంతో ఆ ప్రయత్నాల్ని విరమించుకొని ఇతర విభాగాల కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తయ్యాకే టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చింది. ఈ క్రమంలో వారు పలుమార్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతానుభవాల దృష్ట్యా ఈసారి అలాంటి పరిస్థితి రానీయకుండా ముందే చర్యలు తీసుకుంటున్నారు.

టీఎస్‌పీఏలోనే మహిళల శిక్షణకు యోచన

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12వేల మందికి ఏకకాలంలో శిక్షణ ఇచ్చే సామర్థ్యం గల మైదానాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ(టీఎస్‌పీఏ)తోపాటు కమిషనరేట్లలో, జిల్లా యూనిట్లలో పోలీస్‌ శిక్షణ కళాశాలలు, కేంద్రాలు, బెటాలియన్లను ఇందుకు వినియోగిస్తున్నారు. ఈసారి దాదాపు 16వేల వరకు కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని మండలి ఉన్నతాధికారులు అంచనాతో ఉన్నారు. ఈ క్రమంలో మరో నాలుగు వేల మందికి అదనంగా మైదానాలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్రస్తుతమున్న మైదానాలతోపాటు శిక్షణకు అనువుగా ఉండే ప్రభుత్వ కళాశాలల మైదానాలు, స్టేడియంల లాంటి ప్రదేశాల్లో శిక్షణ ఇవ్వాలనే యోచనతో ఉన్నారు. ఇందుకోసం అవసరమైన అనుమతుల ప్రక్రియపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నారు. ఈసారి మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అంచనా ఉండటంతో వీలైనంత మేరకు వారందరికీ టీఎస్‌పీఏలోనే శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక్కడ అయితే భద్రతతో కూడిన వసతి ఉంటుందనే యోచనతో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని