19 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల అరెస్టు

కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గం కల్‌పెట్టాలో స్థానిక ఎంపీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి చెందిన కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి కేరళ పోలీసులు 19 మంది స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) కార్యకర్తలను అరెస్టుచేసి

Published : 26 Jun 2022 05:39 IST

రాహుల్‌ కార్యాలయంపై దాడి ఘటనలో కేరళ పోలీసుల చర్యలు

వయనాడ్‌, దిల్లీ: కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గం కల్‌పెట్టాలో స్థానిక ఎంపీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి చెందిన కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి కేరళ పోలీసులు 19 మంది స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) కార్యకర్తలను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు, ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్‌.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ఆయనకు తెలిసే ఈ దాడి జరిగిందని ఆరోపించింది. ‘‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు సంఘ్‌ పరివార్‌ ఎజెండా అమలులో భాగంగానే మార్క్సిస్ట్‌ పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తలు రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడిచేశారు. ముఖ్యమంత్రికి తెలిసే ఈ దాడి జరిగింది’’ అని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వ్యక్తిగత సిబ్బంది అయిన అవిశిత్‌ దాడికి పాల్పడిన గుంపులో ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి అతను కొన్ని రోజులుగా తన దగ్గర పనిచేయట్లేదని స్పష్టంచేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నెల ప్రారంభంలోనే అవిశిత్‌ తన దగ్గర పనిచేయడం మానేసినట్లు వెల్లడించారు.

దిల్లీలో యువజన కాంగ్రెస్‌ ఆందోళన

రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడి ఘటనను నిరసిస్తూ శనివారం దిల్లీలో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దాడిలో పాల్గొన్నవారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక గోల్‌ మార్కెట్‌లోని సీపీఎం కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘ఎస్‌ఎఫ్‌ఐ గూండాలను అరెస్టు చేయాలి’, ‘వామపక్ష అరాచకానికి నో చెప్పండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాహుల్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. కల్‌పెట్టాలో కాంగ్రెస్‌ శ్రేణులు శనివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని