బుల్లెట్‌ గాయాలతో ఐఏఎస్‌ కుమారుడి మృతి?

పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ పోప్లి తనయుడు కార్తిక్‌ పోప్లి(27) అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అవినీతి కేసులో జూన్‌ 21న సంజయ్‌ అరెస్టు కాగా.. విజిలెన్స్‌ అధికారుల

Published : 26 Jun 2022 05:39 IST

పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ పోప్లి తనయుడు కార్తిక్‌ పోప్లి(27) అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అవినీతి కేసులో జూన్‌ 21న సంజయ్‌ అరెస్టు కాగా.. విజిలెన్స్‌ అధికారుల బృందం విచారణ నిమిత్తం చండీగఢ్‌లోని ఆయన ఇంటికి వెళ్లింది. ఈ సమయంలోనే కాల్పుల శబ్దం వినిపించిందని అధికారులు చెబుతున్నారు. తనిఖీ చేయగా.. కార్తిక్‌ తనను తాను కాల్చుకొని చనిపోయాడని తేలిందని అంటున్నారు. లైసెన్స్‌డ్‌ షాట్‌గన్‌తో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. కార్తిక్‌ కుటుంబసభ్యులు మాత్రం ఈ వాదనను ఖండించారు. పోలీసులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని సంజయ్‌ భార్య ఆరోపించారు. ‘‘వారు నమోదు చేసిన కేసుకు మద్దతుగా తప్పుడు స్టేట్‌మెంట్లు ఇవ్వాలని మా ఇంట్లోని పనివాళ్లపైనా ఒత్తిడి చేస్తున్నారు. నా కుమారుడు చాలా మంచి లాయర్‌. తప్పుడు కేసు కోసం నా కుమారుడిని కిడ్నాప్‌ చేశారు. వారే చంపేశారు. దీనికి భగవంత్‌ మాన్‌(పంజాబ్‌ సీఎం) సమాధానం చెప్పాల్సిందే. దీనిపై నేను కోర్టుకు వెళ్తా’’ అని అన్నారు. ప్రస్తుతం సంజయ్‌ పోప్లి జైలులో ఉన్నారు. ఓ ప్రభుత్వ ప్రాజెక్టు కాంట్రాక్టులకు అనుమతులు జారీ చేసేందుకు లంచం అడిగారన్న ఆరోపణలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాజెక్టు విలువ రూ.ఏడు కోట్లు కాగా.. ఒక శాతం కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు స్థానిక గుత్తేదారు ఆరోపించారు. ఈ మేరకు సంజయ్‌పై కేసు పెట్టారు. మరోవైపు, సంజయ్‌ ఇంటిపై దాడులు చేసిన అధికారులు భారీ ఎత్తున సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది బంగారు ఇటుకలు, బంగారు నాణేలు, స్వచ్ఛమైన వెండి ఇటుకలు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని