ప్రతి జిల్లాలో మొబైల్‌ ఫోరెన్సిక్‌ యూనిట్‌

దేశంలో ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతి జిల్లాలో మొబైల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. గుజరాత్‌

Published : 27 Jun 2022 05:48 IST

 ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇస్తుంది

- అమిత్‌ షా

ఈనాడు, దిల్లీ: దేశంలో ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతి జిల్లాలో మొబైల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. గుజరాత్‌ రాష్ట్రం కేవడియాలో ‘ఫోరెన్సిక్‌ సెన్సెస్‌ క్యాపబిలిటీస్‌: స్ట్రెంతెనింగ్‌ ఫర్‌ టైమ్‌ బౌండ్‌ అండ్‌ సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌’ అన్న అంశంపై అమిత్‌ షా అధ్యక్షతన కేంద్ర హోం శాఖ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ ఆదివారం సమావేశమైంది. సమావేశంలో అమిత్‌ షా మాట్లాడుతూ సాంకేతితకను వినియోగించుకోవడంలో నేరస్థుల కన్నా దర్యాప్తు సంస్థలు ఒక అడుగు ముందే ఉండాలన్నారు. పోలీసు దర్యాప్తు, విచారణ, ఫోరెన్సిక్‌ సంస్కరణల్లో రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నిర్దేశిత శిక్షా రేటును సాధించేందుకు సాంకేతికత, సాక్ష్యాధారాలతో కూడిన దర్యాప్తు సాగించడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన సాంకేతికతతో పోలీసు కానిస్టేబుళ్ల సామర్థ్యాలను పోలీసు ఉన్నతాధికారుల స్థాయికి పెంపొందించాలని ఆయన సూచించారు. సంస్కరణల్లో భాగంగా ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్వతంత్ర దర్యాప్తు డైరెక్టరేట్‌, స్వతంత్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆరేళ్లకు పైబడి శిక్షలు పడే నేరాల్లో విచారణకు ఫోరెన్సిక్‌ దర్యాప్తు తప్పనిసరి చేసే దిశగా మోదీ ప్రభుత్వం ఉందని అమిత్‌ షా తెలిపారు. జాతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీకి రాష్ట్రాలు తమ రాష్ట్రం నుంచి ఒక కళాశాలను అనుబంధ కళాశాలగా మార్చాలని సూచించారు. సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌, కమిటీ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌, సీఎం రమేశ్‌, గోరంట్ల మాధవ్‌, ప్రేమ్‌చంద్రన్‌, లాకెట్‌ ఛటర్జీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని