Updated : 27 Jun 2022 08:47 IST

ప్రేమ - యుద్ధం!

 ఉక్రెయిన్‌లో పెళ్లిబంధంతో ఒక్కటవుతున్న జంటలు
 కీవ్‌లోనే 4 వేల వివాహాలు

కీవ్‌: రణక్షేత్రంగా మారిన ఉక్రెయిన్‌లో ప్రేమ జంటలు పెళ్లి బంధంతో పెనవేసుకుంటున్నాయి. రష్యా యుద్ధంతో జీవితాలు అల్లకల్లోలంగా మారుతున్నా.. చావైనా, బతుకైనా కలిసే ఉందామన్న నిర్ణయానికి వస్తున్నాయి. ఇలా కీవ్‌ నగరంలోనే 4 వేల జంటలు వివాహాలు చేసుకున్నాయి. కొందరు సైనికులు కూడా యుద్ధానికి వెళ్లే ముందు వివాహాలు చేసుకుంటున్నారు. మరికొందరు తర్వాత ఎలా ఉంటుందోనని భయపడి ముందుగానే పెళ్లి చేసుకున్నారు. ఉన్న కొద్దిరోజులైనా కలిసి బతకొచ్చనే భావనతో ఈ జంటలు  ఒక్కటవుతున్నాయి. ‘‘అంతా కలిసొస్తే.. జీవితం కొనసాగిస్తాం. లేదంటే భార్యాభర్తలుగానే చనిపోతాం’’ అని  ఉక్రెయిన్‌కు చెందిన ప్రేమజంట ఇహోర్‌ జక్వాట్‌స్కీ, కేథరినా లైట్వినెంకో చెబుతున్నారు. కీవ్‌లోని చర్చిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు.

యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్‌లో మార్షల్‌ లా కొనసాగుతోంది. దీని ప్రకారం సైనికులు, సాధారణ పౌరుల వివాహాలకు వెసులుబాటు ఉంది. దరఖాస్తు చేసుకొన్న రోజే వివాహం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సాధారణ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న నెల రోజుల తర్వాతే వివాహం చేసుకోవాల్సి వచ్చేది. యుద్ధం ప్రారంభమైన తర్వాత 3 నెలల పాటు వివాహ రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఇటీవల కీవ్‌లోని సెంట్రల్‌ సివిల్‌ రిజిస్ట్రీని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. ఏప్రిల్‌లో రష్యా సేనలు కీవ్‌ పరిసరాల నుంచి వైదొలిగాక పెళ్లిళ్లు జోరందుకున్నాయి. వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్లిన చాలామంది ఉక్రెయిన్‌కు తిరిగొచ్చారు. ఇలాంటి వారు కూడా వివాహబంధంతో ఒక్కటవుతున్నారు. ‘‘రేపు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే త్వరగా వివాహం చేసుకుంటున్నాం’’ అని కొత్త పెళ్లికూతురు డేరియా పొనోమకెరెంకో (22) తెలిపారు. యుద్ధం నేపథ్యంలో పోలండ్‌కు వెళ్లిపోయిన ఆమె ఇటీవల కీవ్‌కు తిరిగొచ్చారు. 18-60 ఏళ్ల మధ్య వయసు గల పురుషులు దేశం దాటి వెళ్లొద్దనే నిబంధన ఉన్నందున ఆమె ప్రేమికుడు యెవ్హెన్‌ నాలివైకో(23) ఉక్రెయిన్‌లోనే ఉండిపోయారు. పరిస్థితి అనుకూలించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కటైపోయిందీ జంట. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు నిజాయితీతో వ్యవహరిస్తారు. ఏ సమస్య ఎదురైనా జీవితం కొనసాగాల్సిందే’’ అని అన్నా కార్పెంకో (30) చెబుతున్నారు. ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఆమె పెళ్లాడారు. కొందరు రెండోసారి కూడా వివాహాలు చేసుకుంటున్నారు. 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న పావ్లో, ఒక్సానా సావ్రిహా దంపతులు మరోసారి పెళ్లి చేసుకున్నారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని