అగ్నిపథ్‌పై తొలగని ఆందోళన

నాలుగేళ్ల తర్వాత పదవీ విరమణ చేసిన అగ్నివీరులకు లభించే అవకాశాలపై కేంద్రం, పలు రాష్ట్రాలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ విషయమై సంబంధిత యువతలో ఆందోళన కొనసాగుతోంది. ప్రధానంగా ప్రతిపక్షాలు

Published : 27 Jun 2022 05:48 IST

దిల్లీ: నాలుగేళ్ల తర్వాత పదవీ విరమణ చేసిన అగ్నివీరులకు లభించే అవకాశాలపై కేంద్రం, పలు రాష్ట్రాలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ విషయమై సంబంధిత యువతలో ఆందోళన కొనసాగుతోంది. ప్రధానంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ అగ్నివీరులకు అనుకూలంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అగ్నిపథ్‌పై ప్రకటన చేసిన అనంతరం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కొన్నిచోట్ల హింస కూడా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా అగ్నివీరులకు తమ రాష్ట్రాల పోలీసు నియామకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, అస్సాంలు ప్రకటించాయి. కేంద్ర సాయుధ పోలీసు దళాలు, అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలకు 10% రిజర్వేషన్‌ ఇస్తామని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే ఈ వ్యవహారం అంత సులువేమీ కాదని నిపుణులు అంటున్నారు. ఈమేరకు ఉద్యోగ నియామకాల్లో 50%కి మించి రిజర్వేషన్‌ కుదరని విషయాన్ని ఓ రాష్ట్ర పోలీసు నియామక బోర్డు అధిపతి ప్రస్తావించారు. అలాగే ఆయా రాష్ట్రాలు కూడా అగ్నివీరులకు ఎంతమేర రిజర్వేషన్‌ కల్పిస్తాయి? వంటి విషయాలను వెల్లడించాల్సి ఉంది. మరోవైపు భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ పథకాన్ని ఉపసంహరించాలని కోరుతున్నాయి. అగ్నివీరులకు అదనపు కోటా కల్పిస్తే అది స్థానిక యువతలో అసంతృప్తికి దారితీస్తుందని కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాష్ట్ర స్థాయి అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు భాజపాతో జట్టు కట్టిన బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ కూడా అగ్నిపథ్‌పై పెదవి విప్పడం లేదు. భాజపా పాలిత గుజరాత్‌ కూడా అగ్నివీరులకు రాష్ట్ర పోలీసు నియామకాల్లో రిజర్వేషన్‌ విషయమై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గోవాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తామని సీఎం ప్రమోద్‌ సావంత్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎంత శాతం అన్న విషయమై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించనున్నట్లు చెప్పారు.

యువత భవిష్యత్తుతో ఆటలొద్దు : కాంగ్రెస్‌

అగ్నిపథ్‌ పథకంపై కాంగ్రెస్‌ విమర్శల జోరు పెంచింది. మోదీ ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆటలాడుతోందని ధ్వజమెత్తింది. ఈ పథకానికి వ్యతిరేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈమేరకు 20 మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు, అధికార ప్రతినిధులు విలేకరుల సమావేశాలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని