కృత్రిమ టీడీఎస్‌ రిఫండ్‌లతో రూ.1.39 కోట్లు స్వాహా..

సీనియర్‌ అధికారుల సిస్టమ్‌ యాక్సెస్‌ను దుర్వినియోగం చేసిన ముగ్గురు ఆదాయపు పన్ను అధికారులపై సీబీఐ దర్యాప్తు మొదలైనట్లు ఆదివారమిక్కడ అధికారులు తెలిపారు. పలువురు పన్ను చెల్లింపుదారులకు సంబంధించి కృత్రిమ టీడీఎస్‌

Published : 27 Jun 2022 05:53 IST

 ముగ్గురు ఐటీ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తు

దిల్లీ: సీనియర్‌ అధికారుల సిస్టమ్‌ యాక్సెస్‌ను దుర్వినియోగం చేసిన ముగ్గురు ఆదాయపు పన్ను అధికారులపై సీబీఐ దర్యాప్తు మొదలైనట్లు ఆదివారమిక్కడ అధికారులు తెలిపారు. పలువురు పన్ను చెల్లింపుదారులకు సంబంధించి కృత్రిమ టీడీఎస్‌ రిఫండ్‌లు సృష్టించినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ముజఫర్‌నగర్‌ సంయుక్త కమిషనర్‌ ఫిర్యాదు మేరకు ముగ్గురు గ్రూప్‌-సి అధికారులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. పన్ను మదింపు అధికారుల ఆర్‌ఎస్‌ఏ టోకెన్లను దుర్వినియోగం చేస్తూ ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌ (టీడీఎస్‌)కు సంబంధించి కృత్రిమ రిఫండ్‌లను రూపొందించి మోసానికి పాల్పడ్డారన్నది వీరిపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఆర్‌ఎస్‌ఏ టోకెన్లు ప్రత్యేకమనవి. ప్రతి 60 సెకన్లకు ఆటోమేటిక్‌గా వినియోగదారుడి పాస్‌వర్డ్‌ను మార్చేస్తుంటాయి. ఈ మేరకు ఐటీ అధికారులైన అభయ్‌ కాంత్‌, సౌరబ్‌ సింగ్‌, రోహిత్‌ల పేర్లు, తొమ్మిది మంది లబ్ధిదారుల పేర్లను ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రస్తావించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది.. 11 మంది పన్ను చెల్లింపుదారులకు చెల్లింపులు చేసేంద]ుకు సృష్టించిన కృత్రిమ రిఫండ్‌లను ధ్రువీకరించేందుకు పన్ను మదింపు అధికారుల ఆర్‌ఎస్‌ఏ టోకెన్లను దుర్వినియోగం చేసినట్లు ఆదాయపుపన్ను శాఖ పేర్కొంది. ఈ మేరకు గతేడాది ఆగస్టు 1, 2020 నుంచి ఆగస్టు 25, 2021న మోసాన్ని గుర్తించే వరకు రూ.1.39 కోట్ల విలువైన రిఫండ్‌లు జరిగినట్లు తెలిసింది. ఆదాయపుపన్ను చట్టంలోని సెక్షన్‌ 154 కింద పన్ను చెలింపుదారులకు రిఫండ్‌ల మదింపునకు సంబంధించి తన పరిధిలోకి రాని వారికి రిఫండ్‌ల మదింపు జరిగినట్లు ఓ అధికారి గుర్తించడంతో ఈ కుంభకోణం బయటపడింది. ‘‘స్వాహా చేసిన మొత్తంలో సుమారు రూ.35 లక్షలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తిరిగి ప్రభుత్వ ఖాతాల్లో జమచేశారని, అదే సమయంలో ఈ వ్యవహారంలో లబ్ధిపొందిన వారి నుంచి బలవంతపు చర్యల ద్వారా పన్ను మదింపు అధికారులు రూ.22 లక్షలు రికవరీ చేశారు’’ అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని