పార్టీల గుర్తింపు రద్దుచేసే అధికారం కావాలి

రాజకీయ పార్టీల గుర్తింపును రద్దుచేసేందుకు తమకు అధికారాలు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఇప్పటివరకూ వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇచ్చే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.

Published : 27 Jun 2022 05:53 IST

 న్యాయ మంత్రిత్వశాఖను కోరిన ఎన్నికల కమిషన్‌

దిల్లీ: రాజకీయ పార్టీల గుర్తింపును రద్దుచేసేందుకు తమకు అధికారాలు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఇప్పటివరకూ వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇచ్చే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. అయితే గుర్తింపును రద్దుచేసే అధికారం లేదు. ఈ అధికారం కూడా తమకు ఉండాలన్న విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఇటీవల కేంద్ర శాసన కార్యదర్శి వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కొన్ని పార్టీల గుర్తింపు రద్దుచేసే అధికారం ఇవ్వాలని ఈసీ గత కొన్నేళ్లుగా కోరుతోంది. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. ఏదైనా పార్టీకి గుర్తింపు ఇచ్చేటప్పుడు విధించిన నియమ నిబంధనలను అవి పాటిస్తున్నాయా లేదా అనే విషయాన్నీ ఈసీయే పర్యవేక్షించాలి. అందుకే ఏదైనా పార్టీ గుర్తింపు రద్దుచేసే అధికారం ఉండాలని ఈసీ కోరుతోంది. వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగా వివిధ పార్టీల కార్యకలాపాలను పరిశీలిస్తున్నప్పుడు కొన్ని అసలు ఉనికిలోనే లేవని గుర్తించి.. మొత్తం 198 గుర్తింపు లేని పార్టీలను ఇటీవలే రద్దుచేసింది. తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడిన మూడు పార్టీలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖకు సూచించింది. 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయపన్ను మినహాయింపు కోరిన మరో 66 గుర్తింపులేని పార్టీల వివరాలనూ రెవెన్యూ శాఖకు ఈసీ పంపింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఆయా పార్టీలపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరింది. దేశంలో దాదాపు 2,800 గుర్తింపులేని రాజకీయ పార్టీలు ఉన్నాయి. 8 జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందగా, మరో 50 రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని