Updated : 28 Jun 2022 07:02 IST

మా సైన్యానికి సాయం అందించండి

జీ7 దేశాలకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి
ఆదుకుంటామన్న నేతలు

ఎల్‌మావ్‌: రష్యా దాడిని ఎదుర్కోనేలా తమ సైన్యానికి తక్షణం సాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. సంపన్న దేశాలను కోరారు. జర్మనీలోని ఎల్‌మావ్‌లో జరుగుతున్న జీ7 కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో ద్వారా ప్రసంగించారు. ఆయన విజ్ఞప్తికి స్పందించిన ఆయా దేశాల నేతలు.. ఉక్రెయిన్‌కు మద్దతివ్వడానికి కట్టుబడి ఉన్నట్లు హామీ ఇచ్చారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తాము ఇప్పుడు సంక్లిష్ట స్థితిలో ఉన్నామని జెలెన్‌స్కీ తెలిపారు. క్రెమ్లిన్‌తో చర్చలకు ఇది అనువైన సమయం కాదన్నారు. మొదట తాము బలమైన స్థితికి చేరాలని చెప్పారు. అలాంటి సమయం వచ్చినప్పుడే చర్చలకు సిద్ధపడతానని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఈ దిశగా తమకు ఆర్థిక, సైనిక తోడ్పాటు కావాలని చెప్పారు.

జెలెన్‌స్కీ ప్రసంగాన్ని ఆలకించిన జీ7 కూటమి దేశాల నేతలు.. ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంతకాలమైనా సరే ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఉక్రెయిన్‌ ప్రభుత్వమేనన్నారు.  మరోవైపు తాజా శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్‌ అంశం ప్రధాన చర్చనీయాంశమైంది. రష్యా దూకుడుకు కళ్లెం వేయడానికి ఈ దేశాల నేతలు పలు చర్యలకు సిద్ధమవుతున్నారు. రష్యన్‌ వస్తువుల దిగుమతులపై సుంకాలను పెంచనున్నారు. ఆ దేశ ఆయుధ సరఫరా వ్యవస్థలు లక్ష్యంగా కొత్తగా ఆంక్షలను విధించనున్నారు. నార్వే నుంచి ‘నాసామ్స్‌’ అనే విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసి, ఉక్రెయిన్‌కు అందించాలని అమెరికా భావిస్తోంది. జెలెన్‌స్కీ సేనకు శతఘ్ని గుళ్లను, రాడార్లను అందించనుంది.

సదస్సులో జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ విషయంలో జీ7 దేశాల విధానాల్లో ఏకాభిప్రాయం ఉందని చెప్పారు. రష్యాపై కఠిన చర్యలు తీసుకుంటూనే అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉక్రెయిన్‌కు సాధ్యమైనంత సాయం అందిస్తామని తెలిపారు. రష్యాకు, నాటోకు మధ్య భారీ ఘర్షణ జరగకుండా చూస్తామన్నారు. ఉక్రెయిన్‌ తన ఆర్థిక వ్యవస్థను పునర్‌నిర్మించుకునేందుకు సాయపడతామని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ హామీ ఇచ్చారు. ఆత్మరక్షణకూ తోడ్పాటు అందిస్తామన్నారు. మారుతున్న పరిస్థితుల్లో తమ శీఘ్ర స్పందన దళాల సంఖ్యను 40వేల నుంచి 3 లక్షలకు పెంచుతామని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ చెప్పారు.

చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌కు పోటీగా పీజీఐఐ..

2027 నాటికి భారత్‌ వంటి వర్ధమాన దేశాల్లో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు పారదర్శకంగా నిధులు అందించేందుకు జీ7 కూటమి.. ‘పార్టనర్‌షిప్‌ ఫర్‌ గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ (పీజీఐఐ) అనే పథకానికి సంబంధించిన ప్రణాళికను సోమవారం ఆవిష్కరించింది. దీనికింద 600 బిలియన్‌ డాలర్లు సమకూర్చనున్నట్లు తెలిపింది. చైనా చేపట్టిన ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌’కు పోటీగా దీన్ని చేపట్టినట్లు భావిస్తున్నారు. పీజీఐఐ కోసం వచ్చే ఐదేళ్లలో 200 బిలియన్‌ డాలర్లను గ్రాంట్ల రూపంలో అమెరికా సమకూర్చనుందని శ్వేతసౌధం ప్రకటించింది.


ఇతరుల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం
జీ7 దేశాల ఉమ్మడి ప్రకటన

ఎల్‌మావ్‌: అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, ఐరాస ఛార్టర్‌లో పొందుపరిచిన సూత్రాలను గౌరవించి వాటి పరిరక్షణకు పాటుపడాలని జీ7 నేతలు సంకల్పించారు. శాంతి, మానవ హక్కులు, న్యాయబద్ధ పాలన పరిరక్షణలో నిబద్ధతతో వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రజాస్వామ్య దేశాల స్థితిస్థాపకతను బలోపేతం చేయడం, వాతావరణ మార్పులు, కొవిడ్‌ మహమ్మారి లాంటి ప్రపంచ సవాళ్లకు స్థిరమైన పరిష్కారాలను కనుగొనడానికి నిబద్ధతతో కృషి చేస్తాం’’ అని అందులో పేర్కొన్నారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని