అగ్నిపథ్‌కు విశేష స్పందన

అగ్నిపథ్‌ నియామక పథకానికి విశేష స్పందన లభిస్తోంది. భారత వాయుసేనలో నియామకాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 94,281 దరఖాస్తులు వచ్చాయి. రిజిస్ట్రేషన్లు జులై 5 వరకు కొనసాగనున్నాయి. ఈలోగా

Published : 28 Jun 2022 05:54 IST

4 రోజుల్లో 94వేల దరఖాస్తులు

అహ్మదాబాద్‌: అగ్నిపథ్‌ నియామక పథకానికి విశేష స్పందన లభిస్తోంది. భారత వాయుసేనలో నియామకాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 94,281 దరఖాస్తులు వచ్చాయి. రిజిస్ట్రేషన్లు జులై 5 వరకు కొనసాగనున్నాయి. ఈలోగా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఆదివారం నాటికి వాయుసేన 56,960 దరఖాస్తులు స్వీకరించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి భరత్‌ భూషణ్‌ బాబు వెల్లడించారు. సోమవారం ఉదయం 10.30 గంటల నాటికి 94,281 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.

మా గమ్యం అగ్నిపథ్‌

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో గుజరాత్‌లోని ఓ గ్రామానికి చెందిన యువతీయువకులు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరతామని జునాగఢ్‌ జిల్లాలోని లిమ్‌ధరా గ్రామానికి చెందిన 500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. అగ్నిపథ్‌ పథకం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు.


పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలి: మమత

బర్ధమాన్‌: అగ్నిపథ్‌ పథకంలో భాగంగా నియమించుకునే అగ్నివీరుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల సర్వీసు ముగియగానే రిటైర్మెంట్‌ ప్రకటిస్తే వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందన్నారు. బర్ధమాన్‌ జిల్లాలో సోమవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని