వారి ఖాతాలు బ్లాక్‌ చేయండి

న్యాయ సహాయ సంస్థలు, పాత్రికేయులు, రాజకీయ నేతలు, రైతు సంఘాలకు చెందిన పలు ట్వీట్లను, ట్విటర్‌ ఖాతాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ సంస్థను కోరిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 26న ఆ సంస్థ లుమెన్‌ డేటాబేస్‌కు

Published : 28 Jun 2022 05:54 IST

ట్విటర్‌ను కోరిన కేంద్రం!

దిల్లీ: న్యాయ సహాయ సంస్థలు, పాత్రికేయులు, రాజకీయ నేతలు, రైతు సంఘాలకు చెందిన పలు ట్వీట్లను, ట్విటర్‌ ఖాతాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ సంస్థను కోరిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 26న ఆ సంస్థ లుమెన్‌ డేటాబేస్‌కు సమర్పించిన ఓ డాక్యుమెంట్‌తో ఈ విషయం వెల్లడైంది. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటి ప్రముఖ అంతర్జాల సంస్థలు తమ మాధ్యమాల్లోని ఏవైనా వెబ్‌ లింకులు, ఖాతాలను నిలిపివేయాలని ఏ చట్టబద్ధ సంస్థ అయినా కోరితే, ఆ సమాచారాన్ని లుమెన్‌ డేటాబేస్‌కు తెలియజేస్తుంటాయి. 2021 జనవరి 5-డిసెంబరు 29 మధ్య కాలానికి ట్విటర్‌ సంస్థ సమర్పించిన డాక్యుమెంట్‌ ప్రకారం.. అంతర్జాతీయ న్యాయసహాయ సంస్థ ఫ్రీడం హౌస్‌, కాంగ్రెస్‌, ఆప్‌నకు చెందిన పలువురు నేతల ట్వీట్లను బ్లాక్‌ చేయాలని కేంద్రం అభ్యర్థించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కిసాన్‌ ఏక్తా మోర్చా సంస్థకు చెందిన ట్విటర్‌ ఖాతాను నిలుపుదల చేయాలని కోరింది. దేశంలో అంతర్జాల హక్కులు హరించుకుపోతున్నాయని ఫ్రీడం హౌస్‌ గతంలో ట్విటర్‌లో ప్రస్తావించింది. అయితే కేంద్రం కోరినట్లు ట్విటర్‌ సంబంధిత ఖాతాలను, ట్వీట్లను బ్లాక్‌ చేసిందా లేదా అన్న విషయం డాక్యుమెంట్‌లో స్పష్టం చేయలేదు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కానీ, ట్విటర్‌ కానీ దీనిపై స్పందించలేదు. అయితే కేంద్రం బ్లాక్‌ చేయాలని కోరిన ఖాతాల్లో చాలావరకూ ఇప్పటికీ కొనసాగుతున్నట్లు సమాచారం. రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కిసాన్‌ ఏక్తా మోర్చాతో పాటు 12కు పైగా సంస్థల ట్విటర్‌ ఖాతాలను కేంద్రం ఆదేశాల మేరకు ట్విటర్‌ నిలిపివేసిందని, దీన్ని ఖండిస్తున్నామని కిసాన్‌ సంయుక్త మోర్చా సోమవారం పేర్కొంది. పాత్రికేయులు రాణా అయూబ్‌ ట్వీట్లను, సి.జె.వెర్లెమాన్‌ ట్విటర్‌ ఖాతాను బ్లాక్‌ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ‘ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌’ సంస్థ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని