Published : 28 Jun 2022 05:54 IST

‘తీస్తాను విడుదల చేయాలి’

జంతర్‌ మంతర్‌ వద్ద 300 మంది ఆందోళన

దిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్‌) అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పౌరసంఘాల సభ్యులు సోమవారం ఆందోళన చేపట్టారు. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైరాం రమేశ్‌, అజయ్‌ మాకన్‌ కూడా హాజరై సంఘీభావం తెలిపారు. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన జాకియా జాఫ్రీకి తీస్తా న్యాయసాయం అందించారు. ఉద్యమకారుల నోరు మూయించేందుకే ముందస్తు కుట్రతో వారిని అరెస్టు చేశారని నిరసనకారులు పేర్కొన్నారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

నాకు కొంత సమయం కావాలి: తీస్తా

తీస్తా సీతల్వాడ్‌, ఆర్‌.బి.శ్రీకుమార్‌లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణలో నోరు మెదపడం లేదని అధికారులు చెప్పారు. ఆ ఇద్దరినీ అహ్మదాబాద్‌ కోర్టు జులై 2 వరకూ పోలీస్‌ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సిట్‌కు అప్పగించారు. అయితే సిట్‌ అధికారులు ఎంతగా ప్రశ్నించినా సరిగా స్పందించడం లేదని అధికారులు చెప్పారు. జవాబులివ్వడానికి తనకు కొంత సమయం కావాలని తీస్తా కోరినట్లు తెలిపారు. తాను ఏం చెప్పదల్చుకున్నా కోర్టు ముందే చెబుతానని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు. శ్రీకుమార్‌ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నట్లు తెలిపారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts