కాలుష్య వాతావరణంతో.. 20% అకాల మరణాలు

సాధారణ పరిస్థితులతో పోల్చితే, కలుషిత వాతావరణంలో నివసిస్తున్న వారిలో అకాల మరణాలు 20 శాతం అధికమని ఓ అధ్యయనం తేల్చింది. గుండె నాళాలకు సంబంధించిన వ్యాధుల కారణంగా

Published : 28 Jun 2022 05:54 IST

వాషింగ్టన్‌: సాధారణ పరిస్థితులతో పోల్చితే, కలుషిత వాతావరణంలో నివసిస్తున్న వారిలో అకాల మరణాలు 20 శాతం అధికమని ఓ అధ్యయనం తేల్చింది. గుండె నాళాలకు సంబంధించిన వ్యాధుల కారణంగా సంభవించే మరణాలు కూడా 17శాతం ఎక్కువేనని పేర్కొంది. ఇళ్లలో కలప, కిరోసిన్‌ పొయ్యిల నుంచి వెలువడే పొగ 23% మరణాలకు కారణమవుతోందని, గుండెకు సంబంధించిన మరణాలను 36 శాతం అధికం చేస్తోందని వివరించింది. ప్లొస్‌ వన్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన వ్యాసం.. వాతావరణ మార్పులు.. అకాల మరణాలకు, గుండెపోటుకు ఎలా దారితీస్తున్నాయో విశదీకరించింది. న్యూయార్క్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇరాన్‌లోని ఈశాన్య ప్రాంతమైన గొలెస్థాన్‌లోని 50,045 మంది గ్రామీణ, పేదల జీవితాలను అధ్యయనం చేశారు. 40 ఏళ్లకు పైబడిన వారిని ఎంపిక చేసుకొని గత 15 ఏళ్లుగా వారి ఆరోగ్య స్థితిని నిరంతరం పరిశీలించారు. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన న్యూయార్క్‌ వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రాజేశ్‌ వేదాంతన్‌ మాట్లాడుతూ ‘‘మా పరిశోధన ప్రధానంగా వ్యక్తిగత, ప్రజారోగ్యంపై ఇంటా బయట వాయుకాలుష్యం చూపిస్తున్న ప్రభావంపైనే సాగింది. రహదారుల పక్కన వాయు, ధ్వని కాలుష్యాలు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా హృదయనాళాలకు సంబంధించిన వ్యాధులకు కారణమై మరణాలకు దారి తీస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఉన్నతాదాయ వర్గాల ప్రజలతో పోల్చితే.. గ్రామీణ, పేదలకు వైద్య సదుపాయాల కొరత వల్ల మరణాలు రేటు అధికంగా ఉంటోంది’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని