ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కన్హయ్య హత్య

కన్హయ్య హత్య భాజపా, కాంగ్రెస్‌ల మధ్య బుధవారం తీవ్రస్థాయి మాటల యుద్ధానికి దారితీసింది. ఆయన హత్యను ఉగ్ర ఘటనగా భాజపా అభివర్ణించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తీవ్రవాదులను

Published : 30 Jun 2022 06:18 IST

విమర్శలు గుప్పించిన భాజపా
తిప్పికొట్టిన కాంగ్రెస్‌

ఉదయ్‌పుర్‌, దిల్లీ: కన్హయ్య హత్య భాజపా, కాంగ్రెస్‌ల మధ్య బుధవారం తీవ్రస్థాయి మాటల యుద్ధానికి దారితీసింది. ఆయన హత్యను ఉగ్ర ఘటనగా భాజపా అభివర్ణించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తీవ్రవాదులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించింది. ఓ వర్గాన్ని సంతృప్తిపర్చేలా గహ్లోత్‌ సర్కారు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించింది. భాజపా అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌ దిల్లీలో ఈ మేరకు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నాయకులకు పదవులను కాపాడుకోవడానికే సమయం సరిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రజా భద్రతను రాష్ట్ర సర్కారు గాలికొదిలేసిందని విమర్శించారు. రాఠోడ్‌ ఆరోపణలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. గహ్లోత్‌ ప్రభుత్వం రాజధర్మాన్ని పాటిస్తుందని.. హత్య కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. హత్య జరిగిన ఆరు గంటల్లోగా రియాజ్‌ అఖ్తారీ, గౌస్‌ మహ్మద్‌లను అరెస్టు చేసిన సంగతిని గుర్తుచేసింది.

దాడులకు అడ్డుకట్ట వేయాలి: ఆమ్నెస్టీ

కన్హయ్య హత్యను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తీవ్రంగా ఖండించింది. విద్వేష నేరాలకు కారణమయ్యేవారు శిక్షల నుంచి తప్పించుకోకుండా చూడాలని.. ప్రజలపై దాడులకు అడ్డుకట్ట వేయాలని భారత్‌కు సూచించింది. కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, కేరళ సీఎం పినరయి విజయన్‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు కన్హయ్య హత్యను ఖండించారు.


మత సామరస్యాన్ని దెబ్బతీయొద్దు: ముస్లిం సంస్థలు

న్హయ్య హత్యను అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ), జమైత్‌ ఉలేమా-ఎ-హింద్‌ సహా దేశవ్యాప్తంగా పలు ప్రముఖ ముస్లిం సంస్థలు తీవ్రంగా ఖండించాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశాయి. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశాయి. ఇస్లాం శాంతిని కోరుకుంటుందని.. హత్య చేయడమంటే మత విరుద్ధ చర్యలకు తెగబడటమేనని దిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్‌ సయ్యద్‌ అహ్మద్‌ బుఖారీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు