మహాలో కమలం దెబ్బకు రెండు పిట్టలు

మహారాష్ట్ర సీఎంగా శివసేన తిరుగుబాటు నేత ఏకనాథ్‌ శిందే అభ్యర్థిత్వాన్ని అంగీకరించి అందరినీ ఆశ్చర్యంలో పడేసిన కమలదళం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా వ్యూహరచన చేస్తోంది. ‘హిందుత్వ’ నుంచి పక్కకు వెళుతోందన్న శివసేనను బలహీనపరచడం, స్థానిక నేత నాయకత్వాన్ని అంగీకరించడం ద్వారా ‘ప్రాంతీయ సెంటిమెంటు’ను గౌరవించినట్లుగా

Updated : 01 Jul 2022 08:35 IST

దిల్లీ: మహారాష్ట్ర సీఎంగా శివసేన తిరుగుబాటు నేత ఏకనాథ్‌ శిందే అభ్యర్థిత్వాన్ని అంగీకరించి అందరినీ ఆశ్చర్యంలో పడేసిన కమలదళం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా వ్యూహరచన చేస్తోంది. ‘హిందుత్వ’ నుంచి పక్కకు వెళుతోందన్న శివసేనను బలహీనపరచడం, స్థానిక నేత నాయకత్వాన్ని అంగీకరించడం ద్వారా ‘ప్రాంతీయ సెంటిమెంటు’ను గౌరవించినట్లుగా గుర్తింపు పొందడం భాజపా లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అన్నిటినీ మించి 2024 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల నాటికి మహారాష్ట్రలో మళ్లీ బలం పుంజుకోవడం భాజపా ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాల సాధనలో శిందే తమకు ఉపయోగపడతారని కమలదళం భావిస్తోంది. మరాఠాలోని ప్రధాన వర్గం ఎన్సీపీ, శివసేనల పట్ల సానుభూతితో ఉంది. ఇదే వర్గానికి చెందిన శిందే ఆ వర్గాన్ని బుజ్జగించటంలో భాజపాకు సాయంగా ఉంటారని అంచనా వేస్తున్నారు. శివసేనపై తిరుగుబాటు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సొంత పార్టీ ఎంపికపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో స్వతంత్రులతో కలిపి తిరుగుబాటు నేతల బలం 50 దాకా ఉండగా, భాజపాకు 106 స్థానాల బలముంది.

మరో రాష్ట్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్‌

శివసేన, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడి (ఎంవీఏ)గా ఏర్పడి, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తాజా పరిణామాలతో మరో రాష్ట్రంలో అధికారానికి దూరమైంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చేతిలో ఇపుడు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఝార్ఖండ్‌లోనూ జేఎంఎం, ఆర్జేడీల కూటమిలో భాగస్వామిగా ఉంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి మహారాష్ట్ర పరిణామాలు మరో కుదుపుగానే చెప్పవచ్చు. 

అది ‘ఈడీ’ సర్కారు: కాంగ్రెస్‌

దిల్లీ: మహారాష్ట్రలో ఇప్పుడు ‘ఈడీ’ సర్కారు ఏర్పడిందని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. ఏక్‌నాథ్‌ శిందే, దేవేంద్ర ఫడణవీస్‌ పేర్లలో మొదటి అక్షరాలను తీసుకుని నర్మగర్భంగా ఈ మేరకు ట్వీట్‌ చేసింది. ప్రభుత్వాలను పడగొట్టడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థల్ని కేంద్రం ఉపయోగిస్తోందని కాంగ్రెస్‌ పలుమార్లు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.


సీఎంగా చేశాక అంతకన్నా చిన్న పదవి
- మహారాష్ట్రలో ఇది నాలుగోసారి

ముంబయి: సీఎంలుగా సేవలందించి, ఆ తర్వాత అంతకంటే తక్కువ పదవిలో కొనసాగాల్సి రావడం మహారాష్ట్రలో నాలుగోసారి కనిపిస్తోంది. 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్‌.. 2019 ఎన్నికల తర్వాత మూడు రోజుల పాటు ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 1975లో కాంగ్రెస్‌ నేత శంకరరావు చవాన్‌ సీఎం అయ్యారు. రెండేళ్లు పనిచేశాక ఆయన స్థానంలో వసంత్‌దాదా పాటిల్‌ను పార్టీ అధిష్ఠానం సీఎంగా తీసుకువచ్చింది. పాటిల్‌ సర్కారులో మంత్రిగా ఉన్న శరద్‌పవార్‌ 1978లో ఆయన్ని పదవి నుంచి దించి, సీఎం కాగలిగారు. అప్పుడు పవార్‌ ప్రభుత్వంలో పాటిల్‌ ఆర్థిక మంత్రి అయ్యారు. శివాజీరావు పాటిల్‌ నీలంగేకర్‌, నారాయణ రాణే కూడా ముఖ్యమంత్రులయ్యాక కొంతకాలానికి మంత్రుల పదవులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని