స్నేక్‌ ఐలాండ్‌ను వీడిన పుతిన్‌ సేనలు

ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామం చేసుకుంది. నల్ల సముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌ నుంచి రష్యా తన బలగాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌ ఓడరేవులను దిగ్భంధించి, ధాన్యం ఎగుమతులను అడ్డుకుంటూ ప్రపంచ ఆహార సంక్షోభానికి

Published : 01 Jul 2022 06:34 IST

 సుహృద్భావ సూచికగానే వెనక్కి తగ్గామన్న రష్యా

తామే తరిమికొట్టామన్న ఉక్రెయిన్‌

మాస్కో/కీవ్‌: ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామం చేసుకుంది. నల్ల సముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌ నుంచి రష్యా తన బలగాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌ ఓడరేవులను దిగ్భంధించి, ధాన్యం ఎగుమతులను అడ్డుకుంటూ ప్రపంచ ఆహార సంక్షోభానికి రష్యా కారణమవుతోందంటూ ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో స్నేక్‌ ఐలాండ్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు పుతిన్‌ సేన వెల్లడించింది. ఉక్రెయిన్‌ భూభాగం నుంచి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకోవటం కోసం మానవతా కారిడార్‌ ఏర్పాటుచేయాలన్న ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాస్కో తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌ మాత్రం రష్యా దళాలను తాము తరిమికొట్టినట్లు పేర్కొంది. స్నేక్‌ ఐలాండ్‌లో రష్యా సైనిక పరికరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ ద్వీపాన్ని యుద్ధం తొలినాళ్లలోనే రష్యా తమ అధీనంలోకి తీసుకుంది. పావు చదరపు కిలోమీటరు వైశాల్యంతో ఉన్న ఈ ద్వీపం.. నల్ల సముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రదేశం. ఉక్రెయిన్‌ ఆర్థిక కేంద్రమైన ఒడెసా పోర్టుకు 80 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ ద్వీపంపై పట్టు సాధించిన దేశం నల్ల సముద్రంలో నౌకల కదలికలపై నిఘా పెట్టే సామర్థ్యాన్ని దక్కించుకుంటుంది. అయితే స్నేక్‌ ఐలాండ్‌ను రష్యా తన అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి ఉక్రెయిన్‌ సేనలు నిరంతరం దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ దాడులకు భయపడే రష్యా వెనక్కి తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో డాన్‌బాస్‌ ప్రాంతాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకునే దిశగా మాస్కో దళాలు దాడులను ముమ్మరం చేశాయి.

ఉక్రెయిన్‌ పౌరులకు అండగా భారత సంతతి వ్యాపారవేత్త

యుద్ధం కారణంగా స్వదేశాన్ని వీడుతున్న ఉక్రెయిన్‌ పౌరులకు అండగా నిలిచేందుకు భారత సంతతికి చెందిన బ్రిటన్‌ వ్యాపారవేత్త లార్డ్‌ రాజ్‌ లూంబా ముందుకొచ్చారు. వలస వచ్చే ఉక్రెయిన్‌ కుటుంబాలు బ్రిటన్‌లో స్థిరపడటంలో తోడ్పాటునందించేందుకు తన లూంబా ఫౌండేషన్‌ ద్వారా ఆయన విరాళాలు సేకరిస్తున్నారు. లక్ష పౌండ్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 60 వేల పౌండ్లకుపైగా సమకూరాయి. భారత్‌ సహా అనేక దేశాల్లో వితంతువుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు లూంబా ఫౌండేషన్‌ ఏళ్లుగా కృషిచేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని